సోలార్ ‘షాక్’ | Sakshi
Sakshi News home page

సోలార్ ‘షాక్’

Published Sat, Sep 13 2014 2:02 AM

subsidy inverters not reachs to normal persons

 నిన్న మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి. అప్రకటిత విద్యుత్ కోత కారణంగా రాత్రి, పగలు తేడా లేకుండా ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వం సబ్సిడీపై సోలార్ ఇన్వర్టర్లు అందిస్తామంటూ ముందుకు వచ్చింది. దీంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో సోలార్ ఇన్వర్టర్‌ను అమర్చుకుందామని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాశలుగానే మిగిలాయి.

 నాబార్డు ద్వారా 40 శాతం సబ్సిడీపై బ్యాంకర్ల ద్వారా సోలార్ ఇన్వర్టర్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం, పాలకుల మాటలు నీటి మీద రాతలుగానే మిగిలాయి. సామాన్యునికి సబ్సిడీ ఇవ్వకుండా బడాబాబులకే బ్యాంకర్లు ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ పథకం చివరకు ఉన్నత వర్గాలకే పరిమితం అయింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షగానే మారింది. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో విద్యుత్ కోత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సోలార్ విద్యుత్‌పై దృష్టి సారించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకువస్తే మేలు జరిగే అవకాశం ఉంది.

 దెబ్బతిన్న లక్ష్యం :  సామాన్యునికి సోలార్ పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యం దెబ్బతిన్నది. సోలార్ ఇన్వర్టర్లను 40శాతం సబ్సిడీతో బ్యాంకర్ల ద్వారా ఇప్పిస్తామని గత పాలకులు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. ఒక కుటుంబానికి సోలార్ ఇన్వర్టర్ కావాలంటే కెపాసిటీని బట్టి రూ.33,750 నుంచి రూ.56,700 వరకు అందుబాటులో ఉన్నాయని డీలర్లు చెబుతున్నారు. ప్రస్తుతం అప్రకటిత విద్యుత్ కోత కారణంగా విద్యుత్ ఇన్వర్టర్ల బ్యాటరీలు ఆరు నెలల కంటే ఎక్కువ పని చేయవని పేర్కొంటున్నారు.

సోలార్ విద్యుత్‌కు సంబంధించిన బ్యాటరీలు మాత్రం ఎనిమిది సంవత్సరాల వరకు పని చేస్తాయని డీలర్లు చెబుతున్నారు. సౌర ఫలకాలకైతే 25 సంవత్సరాలకుపైగానే వారంటీ ఉందని అంటున్నారు. ఇంటి అవసరాలకు సరిపడా 75 వాట్ల సోలార్ ఇన్వర్టర్ ధర రూ.33,750 కాగా అందులో రూ.13,500ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. 90వాట్ల ఇన్వర్టర్ ధర రూ.40,500నుంచి రూ.43,200వరకు ధ ర ఉండగా రూ.17,280 సబ్సిడీ వస్తుంది.

120వాట్ల ఇన్వర్టర్ రూ.54వేలనుంచి రూ.56,700 వరకు ఉండగా అందులో రూ.22,680 సబ్సిడీ వస్తుందని బ్యాంక ర్లు చెబుతున్నారు. సబ్సిడీలు బ్యాంకులకు కేటాయించకపోవడమే కాకుండా సరైన జీఓ బ్యాంకర్లకు జారీ చేయకపోవడంవల్లే ఈ పరిస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యుత్ కొరత తీవ్రంగా వేధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ విద్యుత్‌పై అధికారులు అవగాహన కల్పించడం లేదని ప్రజలు అంటున్నారు.

ఒక్క కొత్తగూడెంలోనే సోలార్ విద్యుత్ వినియోగదారులు 400 వరకు ఉన్నట్లు డీ లర్లు చెబుతున్నారు. మధిర, వైరా, రెబ్బవరం తదితర పట్టణాలు, గ్రామాల్లో ఉన్న పెట్రోల్ బంకుల వారు ఈ సోలార్ విద్యుత్‌తో బంకులు నడుపుతున్నారు. తక్కువ ఖ ర్చు తో ఉపయోగపడే సోలార్ విద్యుత్‌ను ఎక్కువమంది వినియోగించుకోవాలంటే ప్రజలకు చైతన్యం కల్పించాల్సి ఉంది. నాబార్డు ద్వారా వచ్చే సబ్సిడీని బ్యాంకులకు ముందుగానే పంపినట్లయితే వినియోగదారులు ఎక్కువ మంది ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.

Advertisement
Advertisement