ఆంక్షలకు ఆకాంక్షలు తలొంచవు | Sakshi
Sakshi News home page

ఆంక్షలకు ఆకాంక్షలు తలొంచవు

Published Tue, Dec 5 2017 2:36 AM

Success of 'Koluvula kotlata' meeting  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ఆంక్షలకు ఆకాంక్షలు తలొంచవని, తెలంగాణ సాధించుకున్నట్టుగానే ఉద్యోగాలను కూడా సాధించుకోవాలన్న ఆకాంక్షలు యువతలో బలంగా ఉన్నాయని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన ‘కొలువులకై కొట్లాట’ సభలో ఆయన మాట్లాడారు. నేరుగా టీఆర్‌ఎస్‌ను, ముఖ్యమంత్రిని సంబోధిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘కాంట్రాక్టులు ఇప్పించి కమీషన్లు తీసుకోవడంపై దృష్టిపెడుతున్నారు. భూముల్ని ఎవరికి కట్టబెడదామా.. ఇసుక కాంట్రాక్టులు ఎవరికి ఇప్పించుకుందామా అన్నవే ముఖ్యమంత్రికి ప్రధానమయ్యాయి. కాంట్రాక్లర్ల మేలు కోసమే నిరుద్యోగుల జీవితాలను బలి పెడుతున్నారు.నిరుద్యోగుల సమస్య ఈ ప్రభుత్వానికి అప్రధానమైపోయింది’’ అని విమర్శించారు.

‘‘రాజకీయ నిరుద్యోగుల సభ అని ఓ మంత్రి అంటే నవ్వు వస్తోంది. రాజకీయంలో నిరుద్యోగం ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగం కావాలని, పని ఇప్పించాలని అడగడం సిగ్గుపడే పనేమీ కాదు. మేం తప్పుడు పని చేస్తలేం. నిరుద్యోగులకు అవకాశాలు వచ్చేదాకా వెనుకడుగు వేయం’’ అని కోదండరాం స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ మేమే తెచ్చినమని కొందరు చెప్పుకుంటున్నరు. అమరుల ప్రాణాత్యాగాల ముందు వాళ్ల పని ఎంత? రాజకీయాల్లో ఉన్నవారే రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడితే ఎలా? అంటే వారు కూడా తప్పు చేస్తున్నట్టే కదా. సమస్య ఏమన్నా చెబుదామంటే మంత్రులకే ముఖ్యమంత్రి దొరకడు. అలవైకుంఠపురంబులో.. ఏడు సముద్రాల ఆవల... అన్నట్టుగా మంత్రులకే సీఎం అపాయింట్‌మెంట్‌ ఉండదు’’ అని అన్నారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ విద్యార్థులు, యువకులదేనన్నారు. ‘‘ఇది మన తెలంగాణ. మనం తెచ్చుకున్న తెలంగాణ. తెలంగాణ తెచ్చుకున్నట్టుగానే ఉద్యోగాలను కూడా తెచ్చుకుందాం. చావు సమస్యను దాటేస్తది తప్ప పరిష్కరించదు..’’ అని అన్నారు. ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్థల్లో 2 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామంటున్న ప్రభుత్వం... వాటిలో తెలంగాణవారికి ఎన్ని వచ్చాయో వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు భాగస్వామ్యం లేని రాజకీయాలు నడవనీయబోమని, కొత్త సమాజాన్ని స్థాపిస్తామని స్పష్టంచేశారు.

సభలో ప్రసంగించిన ప్రముఖులు
ఈ సభలో పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రొఫెసర్లు, మేధావులు మాట్లాడారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్, అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి, ప్రొఫెసర్‌ హరగోపాల్, తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ విమలక్క, న్యాయవాది రచనారెడ్డి, జేఏసీ కన్వీనర్లు రఘు, ఇటిక్యాల పురుషోత్తం, గోపాలశర్మ, బైరి రమేశ్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తీర్మానాలివీ..
  ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఖాళీలను వెంటనే ప్రకటించాలి
  ఉద్యోగాల భర్తీ కోసం కేలండర్‌ విడుదల చేయాలి
  స్థానిక పరిశ్రమల్లో తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలివ్వాలి
 కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానం కొనసాగించొద్దు
 ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వ విధానాలు కొనసాగాలి
 నిరుద్యోగ భృతి చెల్లించాలి


ఆయన వ్యక్తిగత సమస్య మాట్లాడటం లేదు
కోదండరాం వ్యక్తిగత సమస్య కోసం మాట్లాడటం లేదు. ఆయన్ను తిట్టి ప్రజలకు దూరం చేస్తా అని సీఎం కేసీఆర్‌ అనుకుంటే ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. కోదండరాంను వాడు అని, రా అని అమర్యాదగా మాట్లాడితే మనస్సు చివుక్కుమంటున్నది. సమస్యలను, నిరుద్యోగుల అసంతృప్తిని నిఘా వర్గాలైనా సీఎంకు చెప్పాలి. రాజకీయాల్లో ప్రజల అభిప్రాయాలను గౌరవించనోడు అప్రతిష్ట పాలవుతాడు.     – చుక్కా రామయ్య (మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త)

కన్నీరు పెట్టని రోజు లేదు
తెలంగాణ వచ్చిన తర్వాత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనుకున్నా. అందరికీ సమన్యాయం అన్న మాట అబద్ధం. రాష్ట్రం వచ్చిన తర్వాత నిర్బంధాలు ఇంకా పెరిగాయి. ఈ మూడున్నర ఏళ్లలో నా కంట కన్నీరు రాలని రోజు లేదు. విద్యార్థులంతా రాజకీయశక్తిగా మారితేనే మార్పు సాధ్యం.    – గద్దర్‌

ఎమ్మెల్యే పోస్టు ఖాళీ అయితే ఐదేళ్లు ఆగుతరా
ఏ సంవత్సరంలో ఖాళీ అయిన ఉద్యోగాలను అదే ఏడాది ఎందుకు భర్తీ చేయరు? ఎమ్మెల్యే పోస్ట్‌ ఖాళీ అయితే ఐదేళ్లు ఆగుతరా? రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్‌ ఉన్నట్టే నిరు ద్యోగులకు ఉద్యోగాలిచ్చే కమిషన్‌ ఎందుకులేదు?  –ప్రొఫెసర్‌ నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ

విద్యార్థుల్లేకుంటే కేసీఆర్‌ ఎక్కడ
విద్యార్థుల తాగ్యాలే లేకుంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఎక్కడ? 1999 దాకా తెలంగాణ పేరెందుకు ఎత్తలేదు? తెలంగాణ వస్తే సమస్యలన్నీ తీరుతాయనుకుంటే మరిన్ని సమస్యలు పెరిగాయి. నిర్బంధాలతో తెలంగాణను అణచివేస్తున్నారు. ఓయూను నిర్బంధానికి ప్రయోగశాలగా మార్చారు. కేసీఆర్‌ ఖబడ్దార్‌..
నీ కొలువు పోయే కాలం దగ్గర పడింది. కోదండరాంకు సంపూర్ణంగా మద్దతుగా ఉంటాం. – టి.జీవన్‌రెడ్డి, సీఎల్పీ ఉపనేత  

కేసీఆర్‌ను దించడమే పరిష్కారం
తెలంగాణ వచ్చిన తర్వాత నిరసనలు, ధర్నాలు ఉండవన్నారు. ధర్నాలకు అవకాశం లేకుండా చేయడం తప్ప సమస్యలను పరిష్కరించ లేదు. రాష్ట్రంలో ఉద్యోగాల్లేవు. భూమాఫియా, లిక్కర్‌ మాఫియా, ఇసుక మాఫియా పేట్రేగిపోతున్నాయి. సీఎం కుర్చీ నుంచి కేసీఆర్‌ను దించేదాకా ఉద్యమించాలి. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. – ఎల్‌.రమణ, టీటీడీపీ అధ్యక్షుడు

యువత త్యాగాలతో కేసీఆర్‌ కుటుంబం భోగాలు
తెలంగాణ కోసం నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆ త్యాగాలతో కేసీఆర్‌ కుటుంబం భోగాలను అనుభవిస్తోంది. కేసీఆర్‌ని నిరుద్యోగిని చేయటానికి ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి. – చాడ వెంకటరెడ్డి, సీపీఐ కార్యదర్శి

తప్పుడు నోటిఫికేషన్లతోనే కేసీఆర్‌ మోసం
ఉద్యోగాలు ఇవ్వడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే తప్పుడు నోటిఫికేషన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసం చేస్తున్నాడు. నోటిఫికేషన్లు తప్పుగా ఉండటం వల్లే కోర్టులు స్టే ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరసన చెప్పే అవకాశం కూడా లేకుండా పోయింది. ఏ అనుమతి కావాలన్నా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. – ఎన్‌.రామచందర్‌రావు, ఎమ్మెల్సీ

Advertisement
Advertisement