విజయవంతంగా కాలేయ మార్పిడి | Sakshi
Sakshi News home page

విజయవంతంగా కాలేయ మార్పిడి

Published Sun, Jul 12 2015 12:53 AM

విజయవంతంగా కాలేయ మార్పిడి

దోమలగూడ : బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడి కాలేయాన్ని రోగికి అమర్చి పునర్జన్మ ప్రసాదించారు వైద్యులు. శనివారం సాయివాణి ఆసుపత్రి ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఆర్‌వీ రాఘవేంద్రరావు ఆపరేషన్ వివరాలు తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన విజయ్‌కుమార్ కాలేయ సంబంధింత వ్యాధితో బాధపడుతూ దోమలగూడలోని సాయివాణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు.

డాక్టర్ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో వైద్యులు శ్రీనివాస్, ఆకాష్ చౌదరి, అనస్థటిషియన్ సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ బృందం ఆయనను పరీక్షించి కాలేయ మార్పిడి తప్పదని తేల్చారు. ఈ క్రమంలో జూన్ 22 న జీవన్‌ధాన్ పథకం ద్వారా విజయవాడలో బ్రెయిన్‌డెడ్ అయిన ఓ యువకుడి సమాచారం తెలుసుకున్న ఈ బృందం అక్కడికి చేరుకుంది. ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడి బ్రెయిన్‌డెడ్ వ్యక్తి కాలేయాన్ని వేరు చేసి విమానం ద్వారా నగరానికి తీసుకువచ్చారు.
 
దాదాపు  9 గంటల పాటు వైద్యుల బృందం విజయ్‌కుమార్‌కు సర్జరీ చేసి కాలేయాన్ని విజయవంతంగా అమర్చారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచిన అనంతరం సాధారణ వార్డుకు మార్చారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేయాలని నిర్ణయించినట్లు రాఘవేంద్రరావు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement