పోలీసులు అరెస్టు చేస్తారేమోనని.. | Sakshi
Sakshi News home page

పోలీసులు అరెస్టు చేస్తారేమోనని..

Published Tue, May 1 2018 2:02 AM

Suicide of a tribal young man with fear - Sakshi

అశ్వారావుపేట రూరల్‌: దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న ఓ గిరిజన యువకుడు పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉసిర్లగూడేనికి చెందిన కల్లూరి శివరామకృష్ణ (28)పై స్థానిక పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు. కొద్దిరోజులుగా వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు తనను అరెస్ట్‌ చేసి చిత్రహింసలకు గురి చేస్తారేమోనని భయంతో శివరామకృష్ణ ఆదివారం ఇంట్లోనే పురుగుల మందు తాగి మృతి చెందాడు.

ఈ విషయమై పోలీసులను మృతుడి కుటుంబీకులు నిలదీస్తే సరైన సమాధానం చెప్పలేదు. దీంతో వారు పోలీసుస్టేషన్‌ వద్ద ఆందోళన నిర్వహించేందుకు మృతదేహాన్ని ట్రాక్టర్‌పై తరలిస్తుండగా మార్గమధ్యంలో అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గంటకుపైగా తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మృతదేహాన్ని వినాయకపు రం–భద్రాచలం ప్రధాన రహదారిపై ఉంచి ఐదు గంటల పాటు ఆందోళన చేపట్టారు. శివరామకృష్ణ మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చివరికి కుటుంబ సభ్యుల్లో ఒకరికి పోలీస్‌ ఉద్యోగానికి కావాల్సిన సహకారం అందిస్తామని, అవసరమైన కోచింగ్‌ ఇప్పిస్తామని సీఐ అబ్బయ్య సర్దిచెప్పడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు.  

అతనిపై మూడు చోరీ కేసులు: సీఐ  
మృతుడు శివరామకృష్ణపై మూడు చోరీ కేసులు నమోదయ్యాయని సీఐ అబ్బయ్య తెలిపారు. అదే గ్రామానికి చెందిన సున్నం నాగేంద్రతోపాటు ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. ఈ క్రమంలోనే పది రోజుల క్రితం ఈ కేసులో నిందితులను అరెస్ట్‌ చేశామని, కల్లూరి శివరామకృష్ణ మాత్రం ఆరోజు నుంచి పరారీలో ఉన్నాడని తెలిపారు. ఆచూకీ కోసం ఆరా తీస్తున్న క్రమంలో అరెస్ట్‌ చేస్తారనే భయంతో పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement