ప్రాజెక్టులకు సహకరిస్తాం | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు సహకరిస్తాం

Published Thu, Jul 24 2014 1:33 AM

ప్రాజెక్టులకు సహకరిస్తాం

తెలంగాణకు మహారాష్ట్ర హామీ ‘మహా’మంత్రితో హరీష్‌రావు చర్చలు సఫలం
 
 హైదరాబాద్: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, నిర్వహణకు సంపూర్ణ సహకారం అందిస్తామని మహా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సహా లెండి, దిగువ పెన్‌గంగ ప్రాజెక్టులకు చెందిన అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు తోడ్పాటును అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రాణహిత బ్యారేజ్ తుది అలైన్‌మెంట్, ముంపు ప్రాంతం, బ్యారేజ్ ఎత్తు అంశాలపై చర్చించుకునేందుకు ఈ ఏడాది ఆగస్టుకు ముందే అంతర్రాష్ట్ర స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిం ది. సాగునీటి ప్రాజెక్టులకున్న అడ్డంకులను తొలగించుకునే  క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు నేతృత్వంలోని ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం బుధవారం ముంబైకి వెళ్లిం ది. మహారాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హసన్ ముష్రిఫ్‌తో భేటీ అయిన బృందం లెండి, దిగువ పెన్‌గంగ, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై చర్చించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పలు అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. లెండి ప్రాజెక్టు ముంపు గ్రామాలకు సహాయ పునరావాసం, పునర్నిర్మాణం అందించేందుకు, హెడ్‌వర్క్‌లను పూర్తి చేసేం దుకు ఒప్పుకొంది. బిచ్కుంద, మద్నూర్ మండలాల్లో 22 వేల ఎకరాలకు సాగునీరందించే లెండి ప్రాజెక్టును 2015లో పూర్తి చేయాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం, పెరిగిన అంచనా వ్యయానికి తగ్గట్టు వాటాను చెల్లించేందుకు అంగీకరించింది.

బ్యారేజ్ నిర్మాణ అధ్యయనానికి మద్దతు..

దిగువ పెన్‌గంగ ప్రాజెక్టు చేపట్టేందుకు రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాన్ని తిరిగి ధృవీకరించాలని కోరిన మహారాష్ట్ర అభ్యర్థనకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దిగువ పెన్‌గంగ,  కింద ప్రతిపాదించిన బ్యారేజ్‌ను ప్రధాన పెన్‌గంగ నుంచి విడదీయాలని, గతంలో చేసిన ప్రతిపాదనలకు  కేంద్ర జల సంఘం నుంచి ఆమోదం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా.. మహారాష్ట్ర అంగీకారం తెలిపింది.  పెన్‌గంగ డ్యామ్ దిగువన బ్యారేజ్ నిర్మించేందుకు పూర్తిస్థాయి అధ్యయనానికి మహారాష్ట్ర ప్రభుత్వం తమ సమ్మతి తెలిపింది.   ప్రతినిధి బృందంలో రాష్ట్ర అటవీశాఖ మం త్రి జోగు రామన్న, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హన్మం త్ షిండే, కోనేరు కోనప్ప, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, నీటిపారుదలశాఖ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ప్రాణహిత చీఫ్ ఇంజనీర్ హరిరామ్, గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్‌రావు ఉన్నారు.
 

Advertisement
Advertisement