మా భూములు సర్వే చేయండి.. | Sakshi
Sakshi News home page

మా భూములు సర్వే చేయండి..

Published Wed, Oct 2 2019 11:36 AM

Surveyor Not Measure The Farmers Lands In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: జిల్లాలో 21 మండలాలు ఉండగా.. 21 మంది సర్వేయర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ప్రభుత్వానికి సంబంధించిన భూముల సర్వేతోపాటు ఎవరైనా రైతులు తమ భూములను సర్వే చేయాలని దరఖాస్తు చేసుకుంటే.. ఆయా భూములను సర్వే చేసి సరిహద్దులు నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే రైతులు తమ భూముల సర్వే కోసం తొలుత మీసేవలో దరఖాస్తు చేసుకుంటారు. ఇవన్నీ తహసీల్దార్‌ కార్యాలయాలకు చేరుకుంటాయి. వాటిని పరిశీలించిన అధికారులు తొలుత వచ్చిన దరఖాస్తును తొలుత పరిష్కరించేందుకు ఆ పనిని సర్వేయర్లకు అప్పగిస్తారు.

తమ వద్దకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం సర్వేయర్లు క్షేత్రస్థాయిలో రైతుల భూములను కొలిచి.. సరిహద్దులు నిర్ధారించాల్సి ఉంటుంది. జిల్లాలో ఆరు నెలల కాలంలో తమ భూములను సర్వే చేయాలని కోరుతూ 3,319 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 323 దరఖాస్తులను తిరస్కరించారు. అయితే సర్వేయర్లు సుమారు 15వేల ఎకరాల వరకు భూమిని కొలవాల్సి ఉండగా.. 6వేల ఎకరాల వరకే కొలిచినట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్న రైతులు మాత్రం తమ భూములు సర్వే చేయాలంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.  

ప్రభుత్వ పనులతో.. 
మండలానికి ఒక సర్వేయర్‌ ఉండడంతో వారిని అధికారులు ప్రభుత్వ పనుల కోసం వినియోగిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతుండడంతో ఆయా పనులకు సంబంధించి భూముల సర్వే చేపట్టాల్సి వస్తోంది. దీంతో నెలలో ఎక్కువ భాగం ప్రభుత్వ భూములు సర్వే చేయడంతోనే సరిపోతుందని పలువురు సర్వేయర్లు పేర్కొంటున్నారు. గతంలో ఎస్సారెస్పీ, నేషనల్‌ హైవే పనులు సాగాయి. దీంతో అధిక శాతం మంది సర్వేయర్లు ఇందుకు సంబంధించిన భూముల సర్వేలోనే నిమగ్నం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎక్కడైనా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించినా.. లేదంటే ఎవరైనా దాతలు ముందుకొచ్చి స్థలం దానం చేసినా.. ఆ స్థలాన్ని సర్వేయర్లు కొలిచి.. ఎంత స్థలం అవసరం అవుతుందనే వివరాలను అంచనా వేసి ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామాల్లో ప్రస్తుతం ఈ పనులు ముమ్మరంగా సాగుతుండడంతో సర్వేయర్లు ఈ పనుల్లోనే బిజీగా ఉన్నారు.

రైతుల ఎదురుచూపులు.. 
సర్వేయర్లు వివిధ పనులతో బిజీగా ఉండడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మీసేవలో దరఖాస్తు చేసుకున్న రైతులు.. ఎంతకూ సర్వేయర్లు స్పందించడం లేదని గ్రీవెన్స్‌లో వినతిపత్రాలు అందిస్తున్నారు. నెలలు గడుస్తున్నా.. తమ భూములను సర్వే చేయడం లేదని వాపోతున్నారు. పహాణీలో భూమి తప్పుగా నమోదు కావడం.. ఇద్దరు రైతుల మధ్య సరిహద్దు పంచాయితీ, భూమి ఆక్రమణకు గురికావడం తదితర సమస్యలతో రైతులు తమ భూములు సర్వే చేయాలని దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే నెలలతరబడి సర్వేకు నోచుకోకపోవడం.. సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామాల్లో ఘర్షణలు కూడా చోటు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రైతులు మాత్రం సర్వేయర్లు తమ దరఖాస్తులను పట్టించుకోవడం లేదని, వారికి ఇష్టం వచ్చిన వారికైతే వెంటనే సర్వే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

భూమి చూపించండి.. 
మా భూమిని సర్వే చేసి.. అప్పగించాలని ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాం. అధికారులు ఇప్పటివరకు మా భూమిని కొలత వేయలేదు. తరతరాలుగా వస్తున్న మా భూమికి సరైన హద్దులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.  
– గుడవర్తి వెంకటేశ్వర్లు, కొత్త లింగాల, కామేపల్లి మండలం

ఫిర్యాదులు పరిష్కరిస్తున్నాం.. 
రైతులు వివిధ సమస్యల నిమిత్తం భూముల సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో మా సిబ్బంది వీలైనంత వరకు సమస్యలు పరిష్కరిస్తున్నారు. వివిధ ప్రభుత్వ పనులు కొనసాగుతుండడంతో క్షేత్రస్థాయిలో ఆ పనుల్లో సర్వేయర్లు నిమగ్నమయ్యారు. దీంతో జాప్యం జరిగితే పెండింగ్‌ దరఖాస్తులపై దృష్టి సారించి.. త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం.  – సీహెచ్‌.శ్రీనివాసులు, ఏడీ ఎఫ్‌ఏసీ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ 

Advertisement
Advertisement