డిపో ఎదుట ఓ కండక్టర్‌ ఆవేదన | Sakshi
Sakshi News home page

డిపో ఎదుట కండక్టర్‌ ఆందోళన

Published Thu, Jun 11 2020 12:59 PM

Suspension Conductor Protest in front of Bus Depot in Medchal - Sakshi

పరిగి: ఉద్యోగంలోకి తీసుకోకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఓ కండక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈమేరకు డిపో ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు.. పరిగి ఆర్టీసీ బస్‌ డిపోలో మాణిక్‌నాయక్‌ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో గతేడాది ఆయన విధుల్లో ఉన్న బస్సులో టీసీలు తనిఖీలు చేసి అతడిపై అభియోగం మోపారు. ఓ ప్రయాణికురాలి వద్ద టికెట్‌ మిస్‌ కావటంతో కండక్టర్, డ్రైవర్‌ను సస్పెండ్‌ చేశారు.

ఇందులో కండక్టర్‌ టికెట్‌ ఇచ్చినప్పటికీ తానే పోగొట్టుకున్నానని ప్రయాణికురాలు లిఖితపూర్వకంగా రాసిచ్చింది. అనంతరం కొద్ది నెలలకు డ్రైవర్‌ను మాత్రమే విధుల్లోకి తీసుకున్నారు. ఇటీవల మాణిక్‌నాయక్‌ భార్య అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలైంది. ఏడాదిగా వేతనం లేకపోవటం, భార్య అనారోగ్యానికి గురవడంతో కుటుంబం గడవటం కష్టంగా మారింది. ఈక్రమంలో బుధవారం ఆయన పరిగి డిపో ఎదుట బైఠాయించాడు. తనను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేశాడు.  ఈ విషయమై పరిగి డీఎం సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా.. మాణిక్‌నాయక్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయటానికి ఉన్నతాధికారుల నుంచి ఆర్డర్‌ రావాల్సి ఉందన్నారు. ఆయన సస్పెన్షన్‌లో ఉన్నందున సగం వేతనం వచ్చేలా అకౌంటెంట్‌తో మాట్లాడతానని స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement