మంత్రులకు నిరసన సెగ | Sakshi
Sakshi News home page

మంత్రులకు నిరసన సెగ

Published Fri, Apr 8 2016 2:15 AM

మంత్రులకు నిరసన సెగ - Sakshi

నిధులు, విధుల కోసం నిరసనకు దిగిన టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ, ఎంపీపీలు
రసాభాసగా ఐటీడీఏ పాలకమండలి సమావేశం

 
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అధికారంలో ఉన్న మంత్రులను ప్రతిపక్ష పార్టీల సభ్యుల నిలదీతలు.. నిరసనలు తెలపడం సాధారణం.  కానీ.. అధికార పార్టీ సభ్యులే మంత్రులను నిలదీసిన ఘటన గురువారం ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌లో జరిగిన ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో చోటు చేసుకుంది. రెండేళ్లుగా తమకు నిధుల్లేవు.. విధుల్లేవు.. గ్రామాలకు వెళ్తే ప్రజలు తిడుతున్నారంటూ.. ప్రభుత్వం తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని టీఆర్‌ఎస్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలను నిలదీశారు. నోటికి గుడ్డలు కట్టుకుని నిరసనకు దిగారు.

‘మీ కొక్కరికే జీతాలు పెరిగితే సరిపోతుందా.. మీ ఏసీడీపీ నిధుల మాదిరిగానే మాకు నిధులు కేటాయించాలి.. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి.. మిగిలింది మూడేళ్లే.. స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు తొసేసుకుంటూ కాలం వెల్లబుచ్చుతున్నాయి..’ అంటూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సీట్లలో నుంచి నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వచ్చే జెడ్పీ సమావేశంలోగా సీఎంను కలిపించి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయకపోతే.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా కూడా ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని పలువురు సభ్యులు వాపోయారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా నిలబడి వారికి మద్దతు పలికారు. స్థానిక సంస్థల బలోపేతం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అధికార పార్టీ సభ్యులు నిరసన తెలిపితే బాగుండదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి సమస్యను వివరించారని చెప్పుకొచ్చారు. అయినా సభ్యులు శాంతించలేదు. వచ్చే జెడ్పీ సర్వసభ్య సమావేశం లోగా సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామని, తమ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని మంత్రులు హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు.


 ముందస్తు సమావేశం..
తమకు నిధుల కేటాయింపు విషయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొంతకాలంగా రగిలిపోతున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలోనే నిరసనకు దిగాలని భావించారు. కానీ, ఆ సమావేశానికి మంత్రులు హాజరుకాకపోవడంతో సభ్యులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. తాజాగా గురువారం జరిగిన ఐటీడీఏ పాలకమండలి సమావేశానికి సుమారు 40 మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు హాజరై నిరసన దిగారు. వీరిలో కొందరు బుధవారమే జిల్లా కేంద్రంలో ఓ ప్రజాప్రతినిధి అధికారిక నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తమ సమస్యలపై చర్చించుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement