Sakshi News home page

వారంలో ‘వారసత్వం’

Published Sun, Oct 30 2016 1:59 PM

వారంలో ‘వారసత్వం’

యాజమాన్యంపై ప్రజాప్రతినిధుల ఒత్తిడి
మొదటిసారి కార్మికులందరికీ వర్తించేలా నిర్ణయం?
వరుస భేటీలతో సీఅండ్‌ఎండీ బిజీబిజీ
నవంబర్‌ మొదటి వారంలో డైరెక్టర్ల సమావేశం


సింగరేణి వారసత్వ ఉద్యోగాల అమలుపై కార్మికుల్లో విస్తృత చర్చ మొదలైంది. సింగరేణి కార్మికులను సరిహద్దు సైనికులతో పోల్చుతూ సంస్థలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో సంస్థ విధివిధానాలు ఎలా ఉంటాయని కార్మికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారసత్వ ఉద్యోగాలు స్పష్టమైన ఆదేశాలు వస్తే సుమారు 20 వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశముంది.


యైటింక్లయిన్‌కాలనీ(పెద్దపల్లి జిల్లా): ఈ నెల 6న సీఎం కేసీఆర్‌ సింగరేణి సంస్థ సీఅండ్‌ఎండీ శ్రీధర్‌తో సమావేశమై గుర్తింపు యూనియన్‌ నాయకులు, కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల సమక్షంలోనే వారసత్వ ఉద్యోగాలపై ఆదేశాలు జారీచేశారు. పదిరోజుల తర్వాత ఇంధనశాఖ కార్యదర్శికి దీనిపై లేఖను ముఖ్యమంత్రి కార్యాలయం అందజేసింది.  దీనిపై చర్చించేందుకు సంస్థ సీఅండ్‌ఎండీ ఇంధనశాఖ కార్యదర్శితో ఇటీవల సమావేశమయ్యారు. తర్వాత టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కవిత సాధ్యమైనంత త్వరగా కార్మికులకు ఫలాలు అందాలని సంస్థ సీఅండ్‌ఎండీ శ్రీధర్‌కు సూచించారు. ఈనేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై సీఅండ్‌ఎండీ శ్రీధర్, గతంలో సంస్థ సీఅండ్‌ఎండీగా పనిచేసి ప్రస్తుత సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు తరచూ భేటీ అవుతున్నారు. వారసత్వంపై త్వరగా తేల్చేందుకు సిద్ధమవుతున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో విధివిధానాలు సిద్ధంచేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

20 వేల మంది ఎదురుచూపు?
సింగరేణిలో ప్రస్తుతం వారసత్వ ఉద్యోగాలు అమలైతే సుమారు 20వేల మంది కార్మికులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సంస్థలో ప్రస్తుతం సుమారు 55 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా.. రాబోయే రెండేళ్లలో 6 వేల మంది కార్మికులు ఉద్యోగ విరమణ చేయనున్నారు. 1998, జూన్, 6న జరిగిన ఒప్పందం మేరకు వారసత్వ ఉద్యోగాలను సింగరేణిలో నిలిపివేశారు. 18 ఏళ్ల తర్వాత సీఎం కేసీఆర్‌ చొరవతో వారసత్వ ఉద్యోగాల అంశం తెరపైకి వచ్చింది. షరతుల్లేని వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఈ నెల 6న ఆదేశాలు జారీచేశారు.

కోటి ఆశల్లో కార్మికులు
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై ముఖ్యమంత్రి ప్రకటన చేసిన నేపథ్యంలో కార్మికులు కోటి ఆశలు పెట్టుకున్నారు. దసరా కానుకగా షరతులు లేకుండా సింగరేణి కార్మికుడి కొడుకు లేదా అల్లుడికి వారసత్వ ఉద్యోగాలు అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో ఎవరెవరికి వర్తించేనో అని ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈనెలలో దిగిపోయిన కార్మికులకూ వారసత్వ ఉద్యోగాలు వస్తాయని టీబీజీకేఎస్‌ నాయకులు గనులపై ప్రచారం చేస్తున్నారు.

బోర్డ్‌ఆఫ్‌ డైరెక్టర్ల నిర్ణయమే కీలకం..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన నేపథ్యంలో దీనికి సంబంధించిన నోట్‌ ఇంధనశాఖ కార్యదర్శి ఈనెల 16న పంపించారు. దీనిపై సంస్థ సీఅండ్‌ఎండీ, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి, ఇందనశాఖ కార్యదర్శి తర్జన,భర్జన పడుతున్నారు. ఈక్రమంలో టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కవిత, కోల్‌బెల్ట్‌ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా వారసత్వ ఉద్యోగాల కోసం పట్టుపడుతున్నారు. త్వరలో దీనికి సంబంధిన విధివిధానాలు యాజమాన్యం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ముందుగా డైరెక్టర్‌(పా) యూనియన్లతో సమావేశమై అందరి అభిప్రాయాలను తీసుకోనున్నారు. సంస్థ అభిప్రాయాలు, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల డిమాండ్లు, ప్రభుత్వ ఆదేశాలను పరిగణలోకి తీసుకుని బోర్డ్‌ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో తీసుకునే నిర్ణయమే ఫైనల్‌గా భావిస్తున్నారు.

మరో వారం పట్టే అవకాశం..?
సింగరేణి బోర్డ్‌ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశానికి వారం ముందుగానే నోటీసు జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఈనెలలో బోర్డు సమావేశం ఉండడం అనుమానంగా కన్పిస్తోందని అంటున్నారు. ఈనెల బోర్డ్‌ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం నోటీసు జారీచేసినా వారం తర్వాత అంటే  వచ్చేనెల మొదటì వారంలో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. టీబీజీకేఎస్‌ నాయకులు రెండురోజుల ముందు దిగిపోయే వారికి వారసత్వ ఉద్యోగాలిస్తామని చెబుతున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి..!

Advertisement

What’s your opinion

Advertisement