Sakshi News home page

ఏమవుతుందో..?

Published Fri, Oct 10 2014 2:52 AM

ఏమవుతుందో..?

 సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఎండిన పంటలు..రైతుల ఆత్మహత్యలు మరోసారి రాజకీయం కానున్నాయి. కరెంటు కోతలతో పంటలు ఎండిపోవడానికి, రైతుల బలవన్మరణాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ విధానాలే కారణమంటూ  టీడీపీ దుమ్మెత్తి పోస్తోంది. జిల్లాలో శుక్రవారం చౌటుప్పల్ నుంచి సూర్యాపేట వరకు బస్సుయాత్ర చేపట్టి, సూర్యాపేటలో ధర్నా చేస్తామని టీటీడీపీ నాయకత్వం ప్రకటించిన వెంటనే టీఆర్‌ఎస్ నాయకులనుంచి తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. ‘టీడీపీ చేపట్టే బస్సుయాత్ర ‘కాశీ’యాత్రే. ఆ యాత్రను అడ్డుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు..’ అని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నేరుగానే హెచ్చరిక చేశారు. ఇరుపార్టీల విమర్శ, ప్రతి విమర్శల నేపథ్యంలో టీడీపీ బస్సుయాత్ర సజావుగా సాగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 ప్రతికూలత తప్పదా..?
 జిల్లా సరిహద్దుల్లోని చౌటుప్పల్ మండలంలో మొదలుపెట్టి చిట్యాల, నార్కట్‌పల్లి, మీదుగా సూర్యాపేట దాకా టీడీపీ బస్సుయాత్ర సాగనుంది. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సిం హులు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి,  ఇతర ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, జిల్లా నాయకులు ఈ యాత్రలో పాల్గొననున్నారు. అయితే, టీడీపీ నేతలు పరిశీలించే ఎండిపోయిన వరి పొలాలు, పరామర్శించే రైతు కుటుంబాలు ఉన్న ప్రాంతాలు టీఆర్‌ఎస్‌కు పట్టున్నవే. మునుగోడు, నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరగనుండగా ఈ మూడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇక, వీరు ధర్నా తలపెట్టిన సూర్యాపేట మంత్రి జగదీష్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం గమనార్హం. ఈ కారణంగానే టీడీపీ బస్సుయాత్రను అడ్డుకునేందుకు ప్రజలకు సిద్ధంగా ఉన్నారని మంత్రి జగదీష్‌రెడ్డి ఓ రకంగా టీడీపీ నాయకత్వానికి హెచ్చరిక పంపారు. ఈ అంశాలన్నింటినీ ఒకచోట పేర్చి విశ్లేషిస్తే.. యాత్రకు ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతోంది. ‘తెలంగాణ రాష్ట్రానికి కరెంటు రాకుండా అడ్డుకుని, ఇప్పుడు అదే సమస్యపై ఆందోళన చేస్తాం, టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తాం అంటే.. అడ్డుకోకుండా ఎలా ఉంటాం..’ అని టీ ఆర్‌ఎస్ శ్రేణులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నాయి.
 
 ఇటు వర్షాభావ పరిస్థితులు ...అటు కరెంట్ కోతలు
 తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు కరెంటుకోతలు కూడా రైతును వెంటాడుతున్నాయి. జిల్లాలోని 59 మండలాలకు గాను 53 మండలాల్లో తక్కువ వర్షపాతం (సాధారణ వర్షపాతం కంటే తక్కువగా) నమోదైంది. ఈ కారణంగానే అన్ని రకాల పంటలు కలిపి 1.50లక్షల హెక్టార్ల సాగువిస్తీర్ణం తగిపోయింది. ఇది పంటల దిగుబడి మీద ప్రభావం చూపనుంది. రైతులను అప్పుల్లోకి నెట్టనుంది. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో ఖరీఫ్ సీజన్ ముగిసేనాటికి (సెప్టెంబరు 30వ తేదీ) జిల్లా బ్యాంకర్లు రైతులకు నయాపైస కూడా రుణంగా ఇవ్వలేదు. ఈ పరిస్థితులు అన్నీ కలగలిసి రైతును ఉక్కిరిబిక్కిరి చేశారు. మనోధైర్యం కోల్పోయిన కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.  మరోవైపు సాగర్ ఆయకట్టులో దోమపోటు వరిపంటను ప్రమాదంలోకి నెట్టింది. నాన్ ఆయకట్టులో కరెంటు కోతలు వరిపొలాలను ఎండబెట్టాయి. తీవ్ర వర్షాభావం పత్తి పంటను దెబ్బకొట్టింది. రైతుకు ప్రతికూలంగా మారిన ఈ పరిస్థితులను రాజకీయంగా లబ్ధిపొందేందుకు ఉపయోగించుకోవాలని చూస్తుండడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
 

Advertisement
Advertisement