తహసీల్దార్ల బదిలీలకు రంగం సిద్ధం | Sakshi
Sakshi News home page

తహసీల్దార్ల బదిలీలకు రంగం సిద్ధం

Published Wed, Feb 3 2016 2:16 AM

Tahasildarla transfers To prepare the sector

నల్లగొండ : తహసీల్దార్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా సుమారు 15 మంది తహసీల్దార్లను బదిలీచేసే  అవకాశం ఉన్నట్లు తెలిసింది. వీరిలో రిక్వెస్టు కింద బదిలీ కావాలని కోరిన తహసీల్దార్లు ఐదుగురు ఉన్నారు. తహసీల్దార్ల బదిలీలు రెండేళ్లకోసారి చేయడం సర్వసాధారణం. మరో రెండు, మూడు మాసాలు గడిస్తే తహసీల్దార్ల బదిలీలు జరిగి రెండేళ్లు పూర్తవుతుంది. అయితే పలు చోట్ల తహసీల్దార్లపై వస్తున్న ఫిర్యాదుల మేరకు బదిలీ చేయాలని నిర్ణయించారు.


దీంతోపాటు గతంలో సరియైన పోస్టింగ్ లభించక ఇబ్బంది పడుతున్న వారిని కూడా బదిలీ జాబితాలో చేర్చారు. కొత్త ఓటర్ల జాబితా కసరత్తు జరుగుతు న్నందున ఈ సమయంలో తహసీల్దార్ల బదిలీలు జరగాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. దీంతో కలెక్టర్ ఎన్నికల కమిషన్ అనుమతి కోరుతూ గతంలో లేఖ రాశారు. రెండు, మూడు రోజుల క్రితం తహసీల్దార్ల బదిలీలకు ఈసీ పచ్చజెండా ఊపడంతో రెండు, మూడు రోజుల్లో ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ పూర్తిచేస్తామని కలెక్టర్ తెలిపారు.

ఇదిలా ఉంటే.. గతంలో ఆప్షన్స్ తీసుకుని బదిలీల కోసం ఎదురుచూస్తున్న వీఆర్వోలను కూడా రెండు, మూడు రోజుల్లో బదిలీ చేయనున్నారు. ఉద్యోగ విరమణకు ఏడాది సర్వీసు ఉన్న వారిని మినహాయించి ఒకే చోట ఏడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వీఆర్వోలను సమీప మండలాలకు బదిలీ చేయనున్నారు. ఈ జాబితాలో 180 మంది వీఆర్వోలు ఉన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా అప్పట్లో వారి నుంచి ఆప్షన్స్ తీసుకుని బదిలీ చేయకుండా అధికారులు పెండింగ్‌లో పెట్టారు.

Advertisement
Advertisement