కనుమరుగైన చెరువుల లెక్క తేల్చండి | Sakshi
Sakshi News home page

కనుమరుగైన చెరువుల లెక్క తేల్చండి

Published Thu, Sep 28 2017 1:52 AM

Take out the calculation of the disappearing ponds - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ కారణాలతో కనుమరుగైన చెరువుల లెక్క తేల్చి, వాటి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అలాంటి వాటిలో పునరుద్ధరించలేని చెరువుల ప్రదేశాలను అటవీ శాఖకు లేదా ఇతర శాఖలకు కేటాయించాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైవ్‌ చేపట్టాలని చిన్న నీటిపారుదల శాఖ సీఈలు శ్యామ్‌ సుందర్, సురేశ్‌లను ఆదేశించారు. గతేడాది ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీతో నీటి పారుదల శాఖ అవగాహన కుదుర్చుకుని.. ‘తెలంగాణ జల వనరుల సమాచార వ్యవస్థ (టీడబ్ల్యూఆర్‌ఐఎస్‌)’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఉపగ్రహాల ద్వారా జల వనరులను విశ్లేషించే ఈ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ పనితీరుపై అధికారులు బుధవారం సమగ్రంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా, మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కింద ఉన్న 8,177 కాలువలు 22,700 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నట్టుగా గుర్తించిన ఉపగ్రహ చిత్రాలను హరీశ్‌రావు పరిశీలించారు. ఆయా ప్రాజెక్టుల ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, సబ్‌ డిస్ట్రిబ్యూటరీలు, వాటి పరిధిలో సాగునీటి సరఫరా, ఆయా కాలువల పరిస్థితి, సామర్థ్యం తదితర అంశాలను కూడా సమీక్షించారు. మిషన్‌ కాకతీయకు ముందటి చెరువుల పరిస్థితిని, ప్రస్తుత పరిస్థితితో పోల్చి విశ్లేషించారు.

ఈ వ్యవస్థతో రాష్ట్రంలోని జల వనరుల్లో ఎక్కడెక్కడ ఎంతెంత నీటి నిల్వలు ఉన్నాయో క్షణాల్లో తెలిసిపోతుందని హరీశ్‌రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వర్షపాతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని ఫ్లడ్‌ కంట్రోల్‌ రూమ్‌తో తెలంగాణ జల వనరుల సమాచార వ్యవస్థను అనుసంధానం చేయా లని అధికారులకు సూచించారు. ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు వివరాలను సమగ్రంగా నమోదు చేసేందుకు కడెం ప్రాజెక్టును పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకోవాలని ఆదేశించారు.

రీచార్జ్‌ షాఫ్టులతో భూగర్భ జలాల పెంపు
మిషన్‌ కాకతీయతో రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు అంశంపై హరీశ్‌రావు సచివాలయంలో సమీక్షించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి భూగర్భ జలాల పరిస్థితిపై జిల్లాలు, మండలాల వారీగా భూగర్భ జల వనరుల శాఖ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. ‘తెలంగాణ నీటి వ్యవస్థ అభివృద్ధి పథకం (టీడబ్ల్యూఎస్‌ఐపీ)’లో భాగంగా నల్లగొండ జిల్లాలోని కరవు పీడిత ప్రాంతాలైన మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ, మునుగోడు, చండూరు మండలాల్లోని 22 గ్రామాల్లో భూగర్భ జలాల పెంపు ప్రయోగాత్మక పథకాన్ని చేపట్టినట్లు మంత్రికి అధికారులు వివరించారు.

నాగార్జునసాగర్‌ ఆధునీకరణ పథ కానికి అనుసంధానంగా దీనిని ప్రారంభించగా.. ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయం చేస్తోం దని, రాష్ట్ర భూగర్భజల శాఖ సాంకేతిక సహాయం అందిస్తోందని వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో మిషన్‌ కాకతీయ వల్ల భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. గతంలో బోరు నీటితో ఆరుతడి పంటలు కూడా పండలేదని.. సమీపంలో చెక్‌డ్యామ్, ఇంకుడుగుంత బావి (రీచార్జ్‌ షాఫ్ట్‌) తవ్వడంతో భూ గర్భ జలాలు పెరిగాయని రైతులు చెబుతున్నారన్నారు. చండూరు మండలం నర్మెట్టలో గతేడాది మార్చిలో భూగర్భ జలాలు 34.5 మీటర్ల లోతున ఉండగా.. ఈ ఏడాది మార్చికి 25.6 మీటర్ల లోతుకు పెరిగాయన్నారు.

Advertisement
Advertisement