జన్మభూమి కాదు కర్మభూమి | Sakshi
Sakshi News home page

జన్మభూమి కాదు కర్మభూమి

Published Tue, Oct 7 2014 2:44 AM

జన్మభూమి కాదు కర్మభూమి - Sakshi

కుక్కునూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం ముంపు మండలాల ప్రజల పాలిట కర్మభూమిగా మారిందని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. కుక్కునూరు ప్రాథమిక పాఠశాలలో సోమవారం తహసీల్దార్ సుమతి అధ్యక్షతన ‘జన్మభూమి- మాఊరు’ కార్యకమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలవరం నిర్మాణం పేరుతో ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుకున్న పాలకులు ఇక్కడి ప్రజల బాగోగులను పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు.

ఏపీలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండ లాల్లో ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు ఏమీ లేవన్నారు. వరదలతో నష్టపోయిన పంటలను వ్యవసాయాధికారులు ఇంతవరకు ఎందుకు సర్వే చేయలేదని ప్రశ్నించారు. వర్షాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రబీ పంటల సాగుకు ఉచితంగా విత్తనాలు, ఎరువులను పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

పింఛన్లు ఎప్పుడు ఇస్తారు... ?
వృద్ధులు, వికలాంగులకు పెంచిన పింఛన్లను ఎప్పుడు ఇస్తారని ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ప్రత్యేకాధికారిని ప్రశ్నిం చారు. విభజన కారణంగా ముంపు మండలాలకు చెందిన లబ్ధిదారుల వివరాలను తీసుకోవడంలో ఆలస్యం జరిగిందని రెం డు రోజుల్లో పింఛన్ డబ్బులను చెల్లిస్తామని ప్రత్యేకాధికారి సమాధానమిచ్చా రు. కార్యక్రమంలో సర్పంచ్ మడకం సుజాత, ఉపసర్పంచ్ దండు నారాయణరాజు, సీపీఎం మండల కార్యదర్శి కొన్నె లక్ష్మయ్య, సీపీఐ(ఎంఎల్)నాయకులు ఎస్‌కె.గౌస్, బాసినేని సత్యనారాయణ. వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పగిళ్ల అల్లేశ్, మండల అధ్యక్షుడు కుచ్చర్లపాటి నరసింహరాజు, నాయకులు మన్యం సత్యనారాయణ, మాదిరాజు వెంకన్నబాబు, రావు వినోద్, రాయి రవీందర్, నకిరకంటి నరసింహారావు పాల్గొన్నారు.
 
వంద రోజుల పాలనలో ఏమి సాధించారు..?
దమ్మపేట: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు తమ వంద రోజు ల పాలనలో ఏమి సాధించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ పక్షనేత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. మం దలపల్లి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. రెండు రాష్టాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్ప డి వంద రోజులు గ డిచినా ప్రజలకు చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న బాధితులకు పరి హారం చెల్లించే విషయంపై ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌లు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. తన నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం కనీసం ఆహ్వానం ఇవ్వలేదని, ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు టీడీపీ నాయకులు తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రాలో తెలుగుదేశం ఎంపీ, ఎమ్మెల్యేలు నకిలీ నక్సలైట్లను వెంట బెట్టుకుని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ర్టంలో వ్యవసాయానికి ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సోయం వీరభద్రం, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దారా యుగంధర్, పట్టణ అధ్యక్షుడు పగడాల రాంబాబు, పాకనాటి శ్రీనివాస్, వాల్మీకి రాంబాబు పాల్గొన్నారు.

Advertisement
Advertisement