Sakshi News home page

తమ్ముళ్ల తలో దారి!

Published Tue, Apr 1 2014 8:41 AM

తమ్ముళ్ల తలో దారి! - Sakshi

         *బీజేపీతో దోస్తీ.. తమ్ముళ్ల కినుక
         *కనీసం 12కి తగ్గనంటున్న ‘కమలం’
         *పోటీపై ఆశలు వదులుకుంటున్న టీడీపీ నేతలు
         *కాంగ్రెస్‌లోకి మైనంపల్లి హన్మంతరావు!

 సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ తెలుగుదేశం పార్టీలో ఫిరాయింపులకు రంగం సిద్ధమైంది. బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు దాదాపు ఖరారైనట్టేననే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు పలువురు పార్టీని వీడే పరిస్థితి నెలకొంది. పొత్తు కుదిరితే గ్రేటర్‌లోని 24 స్థానాల్లో కనీసం 12 స్థానాలు ఇవ్వాలని బీజేపీ జాబితా సిద్ధం చేసింది. దీన్ని తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లూ ఏదో చోట నుంచి పోటీకి అవకాశం వస్తుందని పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నాయకులు ఇప్పుడు దీర్ఘాలోచనలో పడ్డారు.

పొత్తుల వల్ల తమ స్థానాలకు ముప్పు తప్పదనే భయం వారిని వెంటాడుతోంది. ఇక తమ దారి తాము వెతుక్కోవాలనే యోచనలో ఉన్నారు. దీంతో వారి దృష్టి ఇతర పార్టీల వైపు మళ్లుతోంది. ఏదో పార్టీలో చేరి తమ స్థానాలు నిలుపుకోవాలనే ఆరాటంతో ఇప్పటికే ఇతర పార్టీలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. బీజేపీ కోరుతున్న స్థానాలు.. టీడీపీ కేటాయించే నియోజకవర్గాలపై బుధవారానికి స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో రెండు రోజులు వేచి చూసి తమ నిర్ణయాన్ని ప్రకటించాలని నగర టీడీపీ నాయకులు పలువురు నిర్ణయించారు.

మరోపక్క.. లౌకిక పార్టీగా చెప్పుకుంటూ, బీజేపీతో జత కట్టే యత్నాలను టీడీపీలోని మైనారిటీ నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇలా అయితే పార్టీలో కొనసాగే పరిస్థితి ఉండదని కుండ బద్దలు కొడుతున్నారు. తాజా పరిణామాల క్రమంలో మంగళవారం సీనియర్ నాయకుడు జాహెద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
 
కాంగ్రెస్‌లోకి ‘దేశం’ ఎమ్మెల్యే మైనంపల్లి
 
టీడీపీకి చెందిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన మెదక్‌ను వదిలి మల్కాజిగిరి శాసనసభ స్థానం నుండి టీడీపీ తరపున పోటీకి సన్నాహాలు చేస్తున్నప్పటికీ, మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లటంతో ఆయన స్థానాన్ని హన్మంతరావుతో భర్తీ చే సేందుకు టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ దామోదర రాజనర్సింహ అధిష్టానాన్ని ఒప్పించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఎంపీ సర్వే సత్యనారాయణ మాత్రం ఈ స్థానం నుంచి నందికంటి శ్రీధర్‌ను ప్రతిపాదిస్తున్నారు.
 
కలవరపెడుతున్న ‘కమలం’
 
టీడీపీతో పొత్తు ఖరారైతే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనీసం 12 స్థానాలు.. అవీ తాము కోరేవి కేటాయించాల్సిందేనని బీజేపీ గ్రేటర్ శాఖ పట్టుబడుతోంది. అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, సనత్‌నగర్, గోషామహల్, మలక్‌పేట, కార్వాన్, యాకుత్‌పురా స్థానాలతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఉప్పల్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీ జాబితాలో ఉన్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా సనత్‌నగర్‌ను టీడీపీకి ఇవ్వాల్సి వస్తే... బదులుగా సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ లేదా నాంపల్లి నియోజకవర్గాల్లో ఒకటి కేటాయించాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తోంది.

యాకుత్‌పురా స్థానాన్ని టీడీపీ ఆశిస్తే... ప్రతిగా చార్మినార్ స్థానాన్ని తీసుకోవాలని యోచి స్తోంది. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం టీడీపీ కోరితే.. అక్కడ అసెంబ్లీ స్థానం నుంచి తమ అభ్యర్థి బరిలో ఉంటారని స్పష్టం చేస్తోంది. మిగతా నియోజకవర్గాలపై రాజీపడబోమని ఖరాఖండీగా చెబుతోంది. పాతబస్తీలో మైనారిటీ ఓట్లు ఎలాగూ చీలిపోతాయి కాబట్టి అక్కడి స్థానాల కన్నా నగర శివార్లలోని సీట్లపై దృష్టి పెట్టాలని నగర బీజేపీ భావిస్తోంది.

Advertisement
Advertisement