టీడీపీ ఫీట్లు | Sakshi
Sakshi News home page

టీడీపీ ఫీట్లు

Published Fri, Dec 5 2014 2:52 AM

tdp lose the strength in district

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సాధారణ ఎన్నికల అనంతరం జిల్లాలో నామమాత్రంగా మారిన తెలుగుదేశం పార్టీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం మరో రాజకీయ ప్రయత్నానికి తెరలేపింది. శాసనసభ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానానికి పరిమితమైన ఆ పార్టీ క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతోంది. ఇప్పటి వరకు పార్టీని, కార్యకర్తలను పట్టించుకోని అధిష్టానం ఒక్కసారిగా జిల్లాపై దృష్టి సారించడం, హడావుడిగా రాష్ట్రస్థాయి నేతలను జిల్లాకు పంపిస్తున్న తీరు ఆ పార్టీ దుస్థితికి అద్దంపడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత కనీసం రాష్ట్రస్థాయి నేతలు, జిల్లా ముఖ్యులు నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు సైతం నిర్వహించకపోవడంతో కార్యకర్తలు అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు.

రైతు కుటుంబాలను ఆదుకునే పేరుతో పర్యటన

రైతు కుటుంబాలను ఆదుకునే పేరుతో టీడీపీ రాష్ట్ర ముఖ్యనాయకులు జిల్లా పర్యటనకు శుక్రవారం వస్తున్నారు. టీటీడీపీ చైర్మన్ రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ముఖ్యనాయకులు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. ఆర్థిక సహాయం అందిస్తారు. రైతు పరామర్శల పేరుతో వస్తున్నప్పటికీ పార్టీలో అలముకున్న తీవ్ర నిస్తేజాన్ని తొలగించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.  పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలను ఈ ఆరునెలల్లో ఏనాడూ పలకరించని మండల, జిల్లాస్థాయి నేతలు కొందరు శుక్రవారం నాటి సభకు  చేస్తున్న హడావిడి ఆ పార్టీ కార్యకర్తలనే ఆశ్చర్యపరుస్తోంది.

పార్టీలో లుకలుకలు..
చెల్లాచెదురైన కేడర్

గత కొంతకాలంగా పార్టీ జిల్లా నాయకత్వంలో సమన్వయం కొరవడిందని కార్యకర్తలు అంటున్నారు. తమను పట్టించుకునే నాథుడే లేకపోయాడని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొద్దిరోజులకే పలువురు కార్యకర్తలు పార్టీకి రాంరాం చెప్పారు. ఇతర పార్టీలను ఆశ్రయించారు. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి కార్యకర్తలను సమాయత్తం చేయకపోవడం, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, జిల్లా టీడీపీలో రెండు వర్గాలుగా ఉండటం, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న వైనం..వీటన్నింటి మధ్య తుమ్మల పార్టీకి రాజీనామా చేశారు. ఆయనబాటలోనే పలువురు టీడీపీ కార్యకర్తలు నడిచారు.

పంచాయతీ, మండల పరిషత్, జెడ్పీటీసీ ఎన్నికల  వరకు కొంత మెరుగ్గా ఉన్న టీడీపీ పరిస్థితి తుమ్మల రాజీనామాతో మరింతగా దిగజారిపోయింది. టీడీపీ నుంచి జడ్పీటీసీలుగా గెలిచిన 18 మందిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరూ టీఆర్‌ఎస్‌లో చేరారు. పలువురు ఎంపీపీలు సైతం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామసర్పంచ్‌లు, సహకార సంఘాల అధ్యక్షులు, చివరికి డీసీసీబీ చైర్మన్ మువ్యా విజయ్‌బాబు, జడ్పీ చైర్‌పర్సన్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, అప్పటి వరకు ఆ పార్టీ అధ్యక్షునిగా ఉన్న కొండబాల కోటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ అంజయ్య కూడా ఆ పార్టీని వీడారు. ఈ పరిణామాలతో ఆ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది.

తుళ్లూరికి పగ్గాలు

తుమ్మలతోపాటు ముఖ్యనేతలు పార్టీ వీడిన తర్వాత పార్టీ సీనియర్ నేత తుళ్లూరి బ్రహ్మయ్యకు టీడీపీ జిల్లా పగ్గాలు అప్పగించారు. అయితే మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ జిల్లా కార్యకలాపాలపై దృష్టి సారించకపోవడంపై కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. శుక్రవారం జిల్లాకు వచ్చే టీడీపీ ముఖ్యనేతల పర్యటన ఏమేరకు సఫలీకృతం అవుతుందో వేచిచూడక తప్పదు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement