టీడీపీ గూడు ఖాళీ | Sakshi
Sakshi News home page

టీడీపీ గూడు ఖాళీ

Published Mon, Feb 23 2015 4:07 AM

టీడీపీ గూడు ఖాళీ - Sakshi

సిద్దిపేట జోన్: తెలంగాణలో టీడీపీ దుకాణం ఖాళీ కానుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని తన నివాసంలో హరీష్‌రావు విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో టీడీపీ కనుమరుగైందన్నారు. మిగతా ప్రాంతాల్లో మిగిలిన ఆ కొద్దిమంది కూడా భవిష్యత్తులో ఉండరన్నారు. టీ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డిలు బాబు డెరైక్షన్‌తోనే తూప్రాన్‌లో సమావేశం నిర్వహించి టీఆర్‌ఎస్ సర్కార్‌పై బురదజల్లే చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. ఆంధ్రాలో అక్కడి ప్రజలకు రుణమాఫీ, పింఛన్లు, ఆహారభద్రతా కార్డులు అందిస్తున్న చంద్రబాబు, హైదరాబాద్‌లోని ఆంధ్రా వారికి నివాసం పేరిట రుణమాఫీని వర్తించకుండా చేశారని ఆరోపించారు.

సార్వత్రిక ఎన్నికల్లో బాబు మోసం తెలియక ఓట్లేసిన హైదరాబాద్‌లోని ఆంధ్రా ఓటర్లు నేడు చంద్రబాబు నిజ స్వరూపాన్ని గుర్తించారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న పాపానికి రుణమాఫీని దూరం చేసిన బాబుకు త్వరలో బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. సంక్షేమ పథకాల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.11 వేల కోట్లను ఖర్చు చేసిందన్నారు. ముఖ్యంగా పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆహార భద్రతా కార్డుల కోసం వీటిని వినియోగించడం జరిగిందన్నారు. తొమ్మిది నెలల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పని తీరుపై విమర్శలు చేస్తున్న ఎర్రబెల్లి, రేవంత్‌లు తమ నియోజకవర్గాల్లో పర్యటించి పథకాల పనితీరును తెలుసుకోవాలన్నారు.
 
మన పథకాలను కాపీ కొడుతున్న బాబు..
తెలంగాణలోని పథకాలను ఆంధ్రాలో కాపీ కొడుతున్న చంద్రబాబును ప్రశ్నించే ధైర్యాన్ని నేర్చుకోవాలని ఆ పార్టీ నేతలకు హరీష్‌రావు హితవు పలికారు. ఆంధ్రాలో ఇరవై కిలోల బియ్యం సీలింగ్ విధానాన్ని ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో దళితుల భూ సేకరణకు రూ.19 కోట్లను ఖర్చు చేశామన్నారు. మరో రూ.20 కోట్లతో జిల్లాలో భూ సేకరణకు చర్యలు చేపడుతున్నామన్నారు.
 టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదుకు జిల్లాలో విశేష స్పందన లభిస్తుందన్నారు. ఇప్పటికే నాలుగు లక్షల సభ్యత్వాలను పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమం ఈనెల 28 వరకు కొనసాగుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మాజీ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు రామచంద్రం, మూర్తి బాల్‌రెడ్డి, కోల రమేష్‌గౌడ్, జాప శ్రీకాంత్‌రెడ్డి, కొండం సంపత్‌రెడ్డి, మరుపల్లి శ్రీను, శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement