టీఆర్‌ఎస్ గూటికి తీగల | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ గూటికి తీగల

Published Thu, Oct 9 2014 11:27 PM

టీఆర్‌ఎస్ గూటికి తీగల - Sakshi

ఆక ర్ష్.. వికర్ష్!

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఊహాగానాలకు తెరపడింది. ఊహించినట్లుగానే మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గులాబీ గూటికి చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా టీఆర్‌ఎస్ వ్యూహానికి ఆకర్షితులైనప్పటికీ, వెనువెంటనే మనసు మార్చుకోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అధికార పార్టీ వలలో చిక్కుకోకుండా టీడీపీ అధిష్టానం బుజ్జగింపులకు దిగినా తీగల మాత్రం మనసు మార్చుకోకుండా షి‘కారు’కే మొగ్గు చూపి షాక్ ఇవ్వగా.. సీఎం కేసీఆర్‌తో భేటీ అన ంతరం ప్రకాశ్‌గౌడ్ యూ టర్న్ తీసుకోవడంతో గులాబీ శిబిరం నివ్వెరపోయింది. గురువారం చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామాలు జిల్లా రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించాయి. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న టీఆర్‌ఎస్ అధిష్టానం.. శివార్లలో బలంగా ఉన్న ‘దేశం’ను లక్ష్యంగా చేసుకుంది.

ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వల విసిరింది. దాదాపు అందరూ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్న గులాబీ నేతలు.. ప్లీనరీలోపు తమ్ముళ్లను తమవైపు తిప్పుకోవాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే ఇటీవల తన కుమారులతోసహా తీగల కృష్ణారెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలోనే కారెక్కాలనే ఆకాంక్షను తీగల వ్యక్తం చేశారు. కార్యకర్తల సమావేశం అనంతరం అధికారికంగా గులాబీ కండువా కప్పుకోవాలని భావించారు. అయితే, టీడీపీని వీడాలనే తన నిర్ణయానికి కార్యకర్తలు, ముఖ్యనేతల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో మీమాంసలో పడ్డ ఆయన దసరా రోజున టీఆర్‌ఎస్ గూటికి చేరాలనే ముహూర్తాన్ని వాయిదా వేశారు. టీఆర్ ఎస్‌లో చేరడం ఖాయమైనప్పటికీ, నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టారనే ప్రచారం నేపథ్యంలో గురువారం గులాబీ జెండా కప్పుకోవడం గమనార్హం. తీగలను నిలువరించేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్వయంగా బుజ్జగింపులకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ఇంటికివెళ్లి మరీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన టీడీపీని వీడకూడదని కోరినా... తీగల మాత్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని, మునిగిపోయే నావలో ఉండలేనని తెగేసి చెప్పినట్లు తెలిసింది.

పీచేముడ్!
తీగలతో కలిసి కేసీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ప్రకాశ్‌గౌడ్ మనసు మార్చుకున్నారు. అభివృద్ధి పనులకు నిధులు అడిగేందుకే సీఎంను కలిశానని, పార్టీ మారేది లేదని స్పష్టంచేశారు. ఈ పరిణామం టీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చింది. పార్టీలో చేరికను ఖరారు చేసుకున్న అనంతరమే ప్రకాశ్‌కు ఆహ్వానం పలికామని, చివరి నిమిషంలో ఎదురు తిరగడం విస్మయం కలిగించిందని గులాబీ నేతలు వాపోయారు. మరోవైపు ప్రకాశ్‌గౌడ్ యూటర్న్ తీసుకోవడంలో అంతర్యమేమిటో బోధపడడం లేదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇప్పటికే పలుమార్లు కేసీఆర్‌తో మంతనాలు జరిపిన క్రమంలో ప్రకాశ్ పార్టీని వీడుతారని భావించామని, చేరినట్లే చేసి వెనక్కిరావడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఇదిలావుండగా, తన నియోజకవర్గంలో కృష్ణా పైప్‌లైన్ పనులను పూర్తి చేస్తేనే టీఆర్‌ఎస్‌లో చేరుతానని సీఎంకు స్పష్టం చేసినట్లు ప్రకాశ్‌గౌడ్ తన సన్నిహితులకు వివరించారు.

నాలుగు నెలల్లో కృష్ణాజలాలను అందిస్తానని, పార్టీలో చేరాలని కేసీఆర్ పేర్కొన్నప్పటికీ, పనులు పూర్తయిన తర్వాతే, అది కూడా కార్యకర్తల అభిప్రాయం మేరకే నడుచుకుంటానని తెలిపానని చెప్పారు. ఇదిలావుండగా, సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును కలిసిన ప్రకాశ్.. టీడీపీని వీడబోనని స్పష్టం చేసినట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement