హరిత తెలంగాణే లక్ష్యం: కేసీఆర్ | Sakshi
Sakshi News home page

హరిత తెలంగాణే లక్ష్యం: కేసీఆర్

Published Sun, Jan 18 2015 1:52 AM

హరిత తెలంగాణే లక్ష్యం: కేసీఆర్ - Sakshi

  • ఆ దిశగా పని చేయండి.. తెలంగాణలో అడవుల శాతం పెంచండి  
  •  అటవీ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం
  •  కాంట్రాక్టు ఉద్యోగులను, విలేజ్ ఫారెస్ట్ వర్కర్లను క్రమబద్ధీకరిస్తాం
  •  అటవీశాఖ అధికారులతో భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చే లక్ష్యంతో పనిచేయాలని అటవీ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25 శాతంగా ఉన్న అడవులను 33 శాతానికి పెంచి.. దేశంలోనే రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. అటవీ శాఖలోని ఖాళీలను భర్తీ చేస్తామని.. వేతన సవరణ, వాహన సదుపాయంతో పాటు భద్రతను కూడా కల్పిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ శివార్లలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీని సీఎం కేసీఆర్ శనివారం సందర్శించారు. ముందుగా అకాడమీలో మొక్కలు నాటి, ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ లోగోను ఆవిష్కరించారు. తర్వాత అటవీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
     
    స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం..

    అట వీ భూముల ఆక్రమణలు, కలప స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న అటవీ చట్టాలను అధ్యయనం చేసి, అవసరమైతే కొత్త చట్టాలను తీసుకురావాలని ఉన్నతాధికారులకు సూచించారు. అటవీ సిబ్బందికి సాయుధ పోలీసుల సాయం ఉండేలా చూస్తామన్నారు. అటవీ సంబంధమైన కేసుల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని, అటవీశాఖలో ప్రత్యేక న్యాయ విభాగాన్ని నెలకొల్పుతామని తెలిపారు. అటవీ అభివృద్ధి సెస్‌తో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్మగ్లర్ల నుంచి ముప్పున్న వారందరికీ భద్రత కల్పించాలని పోలీసుశాఖను ఆదేశించారు.
     
    అటవీ భూములకు హద్దులు..

    కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి అటవీ భూముల సరిహద్దులను నిర్ణయించాలని సీఎం కేసీఆర్ సూచించారు. భూ అసైన్‌మెంట్ కమిటీల్లో అటవీ శాఖ అధికారులను సభ్యులుగా నియమించాలన్నారు. హైదరాబాద్‌లో పచ్చదనం కోసం జీహెచ్‌ఎంసీ నుంచి రూ. 25 కోట్లు కేటాయిస్తామని, ఒక అటవీశాఖాధికారిని జీహెచ్‌ఎంసీలో నియమిస్తామని తెలిపారు. అటవీశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులను, విలేజ్ ఫారెస్ట్ వర్కర్లను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. అడవుల్లో ప్రవహించే నదులు, ఉపనదులపై చెక్‌డ్యాంలు నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల సంఘం డైరీని కేసీఆర్ ఆవిష్కరించారు. సమావేశంలో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావ్, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఫారెస్ట్ అకాడమీ డెరైక్టర్ రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.
     
    పేరు మారలేదు.. తీరు మారలేదు


    ఏ సంస్థ భవనానికైనా పేరు ఓ గుర్తింపు.. కానీ తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ మాత్రం పేరుకు ‘ఫ్లెక్సీ’ ముసుగేసుకుంది. తెలంగాణ ఏర్పడి ఏడు నెలలైనా.. ఇక్కడ మాత్రం ‘ఆంధ్రప్రదేశ్’ పేరు మీదే కొనసాగుతోంది. దూలపల్లిలో ఉన్న ఈ అకాడమీకి శనివారం సీఎం వచ్చారు. ఈ సందర్భంగా ఆ పేరు కనిపించకుండా అధికారులు ఇలా ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement