Sakshi News home page

‘అసెంబ్లీ’ సన్నాహాలపై స్పీకర్ సమీక్ష

Published Sat, Feb 28 2015 2:07 AM

‘అసెంబ్లీ’ సన్నాహాలపై స్పీకర్ సమీక్ష - Sakshi

- హాజరైన సీఎస్,  ఇన్‌చార్జి డీజీపీ
- శాంతిభద్ర తలు,  ఏర్పాట్లపై చర్చ
- అసెంబ్లీ రూల్స్ కమిటీ భేటీ

 
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల సన్నాహాలపై తెలంగాణ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్ల గురించి పలు సూచనలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకేరోజు మొదలవుతున్నందున ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేయాలని, శాంతిభద్రతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని  ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ, ఇన్‌చార్జి డీజీపీ సుదీప్ లక్టాకియాతో భేటీ అయ్యారు.

ఇరు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే సమయాలను ముందే తెలుసుకోవాలని, ఏ రాష్ట సీఎం వస్తున్నా, రెండు రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల వాహనాలు నిలిపివేయాల్సిందేనని పోలీసు అధికారులకు సూచించారు. అసెంబ్లీ మొదటి గేటు నుంచి   సీఎంలు, తెలంగాణ మంత్రులు ప్రవేశిస్తారని, రెండో గేట్ నుంచి ఏపీ మంత్రులు వస్తారని, వీరికి ఎల్పీ కార్యాలయాల వద్దే పార్కింగ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయిం చారు.
 
అసెంబ్లీ రూల్స్ కమిటీ భేటీ
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నిబంధనలు (రూల్స్) రూపొందించేందుకు ఏర్పాటైన ‘రూల్స్ కమిటీ’ మూడో సారి భేటీ అయ్యింది. ఈ మేరకు కమిటీ చైర్మన్, స్పీకర్ ఎస్. మధుసూదనాచారి అధ్యక్షతన శుక్రవారం ఆయన కార్యాలయంలో సమావేశమై, వివిధ అంశాలపై చర్చించింది. శాసనసభకు శాశ్వత ప్రాతిపదికన నిబంధనల తయారీకి సభ్యుల నుంచి పలు ప్రతిపాదనలు వచ్చాయి. సమావేశాలకు ప్రత్యక్ష ప్రసారాలు ఉండాలని, లైవ్ ఫీడ్‌ను సెన్సార్ చేయొద్దని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు సూచించారు. ప్రసారాల ఏజెన్సీని దూరదర్శన్‌కు ఇవ్వాలన్నారు.  వాయిదా తీర్మానాలను ప్రశ్నోత్తరాల సమయం కంటే ముందే చేపట్టాలని దాదాపు అన్ని పార్టీల సభ్యులు స్పీకర్‌ను కోరారు. సమావేశాలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించేలా నిర్ణయించారు. బడ్జెట్‌పై సాధారణ చర్చకు ఆరు రోజులు, పద్దులపై  చర్చకు 18 రోజులు అవసరమని కోరారు. అవసరమైతే పనిగంటలనే కాదు, పని రోజులు కూడా పెంచుతామని, ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి  బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారని తెలి సింది. కమిటీ సభ్యులు మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, కేటీఆర్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, టి.వెంకటేశ్వర్లుభేటీకి గైర్హాజరయ్యారు.
 
 
మార్చి 4న రెండు రాష్ట్రాల సభాపతుల భేటీ
మార్చి 4న తెలంగాణ, ఏపీ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్లు భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్రం త రఫున తీసుకున్న నిర్ణయాలను వారి దృష్టికి తీసుకు రావాలని, వారు ఏమైనా సూచనలు చేస్తే మార్పులు, చేర్పులు చేసుకోవాలని నిర్ణయించారు. బందోబస్తు ఏర్పాటుకు ప్రణాళికను సిద్ధం చేసేందుకు పోలీసు అధికారులూ 4వ తేదీనే భేటీ కానున్నారు. మొదటిగేటు, లేదా రెండో గేటు ఎక్కడి నుంచైనా ఇద్దరు సీఎంలు రావొచ్చన్న అంశాన్నీ చర్చించారు. ఈ భేటీకి ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, శాసన సభా కార్యదర్శి రాజసదారాం హాజరయ్యారు.
 
మార్చి 7 నుంచి అసెంబ్లీ, మండలి బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఈఎస్‌ఎల్ న రసింహన్ శుక్రవారం వేర్వేరుగా నోటిఫికేషన్ జారీ చేశారు.   సమావేశాలు  ఉదయం 11 గంటలకు మొదలవుతాయని పేర్కొన్నారు. అదేరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement