బంద్ సంపూర్ణం | Sakshi
Sakshi News home page

బంద్ సంపూర్ణం

Published Fri, May 30 2014 1:42 AM

Telangana bandh success

సాక్షి, ఖమ్మం: పోలవరం ముంపు మండలాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ జారీ అయిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా...టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం జిల్లాలో సంపూర్ణ బంద్ జరిగింది. సీపీఎం, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ బంద్‌లో పాల్గొన్నాయి. ఆర్డినెన్స్‌కు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. అంతటా దుకాణాలు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు బయటకు కదల్లేదు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు.

 భద్రాచలం డివిజన్‌లో బంద్ సంపూర్ణంగా జరిగింది. భద్రాచలం పట్టణంలో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఎన్డీ ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీ, రాస్తారోకోలు చేపట్టారు.  వీఆర్‌పురంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ముత్యాల రామారావు, కాంగ్రెస్ నాయకుడు కడుపు రమేష్, ఎంపీటీసీ గూటాల శ్రీనివాస్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వాజేడులో టీఆర్‌ఎస్, టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు దిష్టిబొమ్మలను దహ నం చేశారు.

 అయితే చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మ దహనం చేయడంపై టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. దీనికి నిరసనగా టీడీపీ నాయకులు రాస్తారోకో నుంచి బయటకు వెళ్లిపోయారు. కూనవరంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు భద్రాచలం బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణను బహిష్కరించి అంబేద్కర్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు.

     ఖమ్మం పట్టణంలో  టీఆర్‌ఎస్, సీపీఎం, లంబాడీ హక్కుల పోరాటసమితి  ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద వేర్వేరుగా ఆందోళన చేపట్టారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే బాణోతు చంద్రావతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, నాయకులు బేగ్, ఆర్జేసీ కృష్ణ, నూకల నరేష్‌రెడ్డిలు ఆర్డినెన్స్‌ను కేంద్రం వెంటనే వెనక్కుతీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఎం ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, నాయకులు నున్నా నాగేశ్వరరావు, బండారు రవికుమార్, ఎర్రా శ్రీకాంత్ పాల్గొన్నారు.

 సీపీఐ ఆధ్వర్యంలో బస్ డిపో ముందు బైఠాయించారు.  కార్యక్రమంలో పార్టీ జిల్లా కా ర్యదర్శి భాగం హేమంతరావు, నాయకులు పోటు ప్రసాద్ పాల్గొన్నారు. ఎన్డీ ఆధ్వర్యం లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పోటు రంగారావు పాల్గొన్నారు. కలెక్టరేట్, జెడ్పీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు విధులు బహిష్కరించి జేఏసీ నేతృత్వంలో ప్రదర్శన నిర్వహించారు. అలాగే కలెక్టరేట్ ముందు మానవహారం నిర్వహించి ఆర్డినెన్స్ రద్దు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఉదయం నుంచే ఖమ్మంలో పెట్రోల్ బంకులు, సిని మాథియేటర్లు, దుకాణాలు మూతపడ్డాయి.

 కొత్తగూడెం పట్టణంలో టీపీఎఫ్, తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. త్రీ టౌన్ సెంటర్‌లో అఖిలపక్షం నాయకులు నిరసన తెలియజేశారు. టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌వీ నేతలు పోలవరం ప్రాజెక్టు కార్యాలయం ముందు ధర్నాతో నిరసన తెలిపారు. కేటీపీఎస్ ముందు విద్యుత్ ఉద్యోగులు ధర్నాతో ఆందోళన వ్యక్తంచేశారు.

 వైరా నియోజకవర్గంలోని వైరా కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో  గురువారం బంద్ సంపూర్ణంగా జరిగింది. టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, ఎన్డీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొని దుకాణాలు మూయించారు. వైరా, జూలూరుపాడులో అఖిలపక్షం ఆధ్వర్యంలో  రాస్తారోకో చేశారు. ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొణిజర్ల , కారేపల్లిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

పినపాక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, ఎన్డీ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, తుడుందెబ్బ, గిరిజన ఉద్యోగ సంఘాలు, ఎమ్మార్పీఎస్‌తో పాటు జేఏసీ నేతలు బంద్‌లో పాల్గొని ఆర్డినెన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపొద్దంటూ బూర్గంపాడు మండల కేంద్రంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. మోరంపల్లిబంజర, లక్ష్మీపురంలలో రాస్తారోకోలు నిర్వహించారు. మణుగూరులో అఖిల పక్ష జేఏసీ నేతలు పెద్ద సంఖ్యలో పట్టణంలో ప్రదర్శనతో పాటు రాస్తారోకో నిర్వహించారు. డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు కదల్లేదు.

 ఇల్లెందు పట్టణంలో బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది. బంద్‌లో టీఆర్‌ఎస్, ఎన్డీ చంద్రన్న, రాయల వర్గాలు, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య, ఎన్డీ రాయల వర్గం నేత మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, చంద్రన్న వర్గం నేత జె.సీతారామయ్య, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ పులి సైదులు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బయ్యారం మండలంలో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. టేకులపల్లిలో బొగ్గు కోసం కేఓసీ వెళ్ళే లారీలను బోడు రోడ్డు సెంటర్‌లో ఆందోళన కారులు నిలిపివేశారు. బోడు సెంటర్‌లో ఆందోళనకారులకు మద్దతుగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు.

 సత్తుపల్లి నియోజకవర్గంలో గురువారం బంద్ ప్రశాంతంగా జరిగింది.  టీఆర్‌ఎస్, సీపీఎం, టీజేఏసీ, న్యూడెమోక్రసీ, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో బొగ్గు రవాణా నిలిచిపోయింది.

  పాలేరు నియోజకవర్గంలో సీపీఎం, సీపీఐ, ఎన్డీల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కూసుమంచిలో టీఆర్‌ఎస్, ఎన్డీ నేతలు బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. అలాగే నాయకన్‌గూడెం, పాలేరులో రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్‌లో సీపీఐ, సీపీఎంలు వేర్వేరుగా రాస్తారోకో నిర్వహించాయి.

తిరుమలాయపాలెం మండలంలో ఎన్డీ ఆందోళనలతో నిరసన తెలిపింది.

 మధిర పట్టణంలో హోటళ్లు, దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. టీఆర్‌ఎస్, సీపీఎం, టీజేఏసీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.  బస్సులు బయటకు రాకుండా డిపో వద్ద ఉదయమే ఆందోళన చేపట్టారు. ముదిగొండలో  సీపీఎం, టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఖమ్మం- కోదాడ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బోనకల్ మండల కేంద్రంలోని బస్టాండ్, పెట్రోల్‌బంక్ సెంటర్లలో టీఆర్‌ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఎర్రుపాలెం బస్టాండ్ సెంటర్‌లో టీజేఏసీ, టీఆర్‌ఎస్ ఆందోళన నిర్వహించి నిరసన తెలిపాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల నుంచి వచ్చిన బస్సును నిలిపివేసి నిరసన తెలిపారు. చింతకాని మండలంలోని జగన్నాధపురం వద్ద రాస్తారోకో నిర్వహించారు. బస్సులను, ఆటోలను నిలిపివేశారు.

  అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, కుక్కునూరు, వేలేరుపాడు, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండలో బంద్ విజయవంతమైంది. వేలేరుపాడు మండలంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తెలిపారు. అశ్వారావుపేటలో వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్, ఎన్డీ ఆధ్వర్యంలో నిరసనవ్యక్తం చేశారు. ముందుగా రింగ్‌రోడ్డు సెంటర్‌లో అన్ని పార్టీల ఆధ్వర్యంలో సుమారు గంటపాటు రాస్తారోకో చేపట్టారు. ములకలపల్లి మండలంలో టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, ఎన్డీ, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.కుక్కునూరు మండలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పాల్గొని ఆర్డినెన్స్‌కు కేంద్రం వెంటనే వెనక్కుతీసుకోవాలని డిమాండ్ చేశారు. కుక్కునూరు మండలాన్ని తెలంగాణలోనే ఉంచాలని నినాదాలు చేశారు.

Advertisement
Advertisement