మరో ముగ్గురికి.. | Sakshi
Sakshi News home page

మరో ముగ్గురికి..

Published Sat, Nov 3 2018 11:53 AM

Telangana BJP Candidate Second List Released Warangal - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. ఈ సారి ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో ఐదుగురు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. మిగతా ఏడు సీట్లకు ప్రతిపక్షాల జాబితా విడుదల అయ్యాక బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 119 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 20వ తేదీన 38 స్థానాలకు.. తాజాగా శుక్రవారం 28 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో పరకాల నుంచి డాక్టర్‌ పెసరు విజయచందర్‌ రెడ్డి, భూపాలపల్లి నుంచి కిర్తీరెడ్డిలను ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన జాబితాలో వరంగల్‌ పశ్చిమ నుంచి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారరావు, వర్ధన్నపేట నుంచి పంచాయతీరాజ్‌ రిటైర్డ్‌ ఈఈ కొత్త సారంగరావు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి పెరుమాండ్ల వెంకటేశ్వర్లుకు చోటు దక్కింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ.. వరంగల్‌ పశ్చిమ టికెట్‌ అశించింది. అయితే పార్టీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు వైపే మొగ్గు చూపింది.

మహా కూటమి జాబితా తర్వాత..
మహాకూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బీజేపీ మరో జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిసింది. మహా కూటమి తరఫున టికెట్లు ఆశించి భంగపడిన వారిని బీజేపీలో చేర్పించుకుని.. వారికి మిగతా నియోజకవర్గాల్లో అవకాశాలు కల్పించనున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇప్పటి వరకు పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, స్టేషన్‌ ఘన్‌పూర్, వరంగల్‌ పశ్చిమ అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా వరంగల్‌ తూర్పు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ, పాలకుర్తి, ములుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

రావు పద్మకు భంగపాటు
వరంగల్‌ పశ్చిమ నుంచి టికెట్‌ ఆశించిన బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకు నిరాశే మిగిలింది. 2014 ఎన్నికల్లో రావు పద్మ వరంగల్‌ తూర్పు నుంచి పోటీ చేశారు. ఈ సారి ఎన్నికల్లో పశ్చిమ నుంచే పోటీ చేస్తా అని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. బీజేపీకి సంబంధించిన వివిధ కార్యక్రమాలను పశ్చిమలోనే నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. బూత్‌ లెవల్‌ కమిటీల నుంచి మొదలు మిగిలిన అన్ని పార్టీ కార్యక్రమాలకు పశ్చిమ నియోజకవర్గాన్నే కేంద్రీకృతం చేసుకున్నారు. ఇక్కడ తనకుంటూ ఒక కేడర్‌ను కూడా నిర్మాణం చేసుకున్నారు. టికెట్‌ తనకే వస్తుందనే ధీమాతో ఉండగా... ధర్మారావు టికెట్‌ కేటాయించడం పట్ల ఆమె నిర్వేదంతో ఉన్నారు. తీవ్ర నిరాశకు లోనైన ఆమె హుటాహుటిన అనుచరులతో కలిసి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కార్యవర్గంలో దాదాపు 80 శాతం మంది నాయకులు, కార్యకర్తలు తనకు మద్దతు ఉన్నారని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్, ఎన్నికల ఇన్‌చార్జి, జాతీయ సంయుక్త కార్యదర్శి సంతోష్, ఎన్నికల కమిటీ సభ్యురాలు కిషన్‌రెడ్డి, తదితర రాష్ట్ర నాయకులను కలిసి ఏ ప్రాతిపదికన కేటాయించారో అడుగుతానని తెలిపారు.

వెనక్కి తగ్గేది లేదు.. నామినేషన్‌ వేస్తా..
2009లో అప్పటి హన్మకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే 4 వేల ఓట్లకు పరిమితమయ్యారని, 6 సార్లు పోటీ చేస్తే 3వ సారి టీడీపీ పొత్తుతో గెలిచి, ఆ తర్వాత మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తికి ఎలా టికెట్‌ కేటాయిస్తారని ప్రశ్నించారు. పార్టీ జాతీయ నాయకత్వం మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తికి టికెట్‌ కేటాయించమని చెప్పి, ఇప్పుడు ఎలా కేటాయిస్తుందో తెలపాలని మండిపడ్డారు. 2014లో పోటీ చేసిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలు కనుమరుగై ఈ రోజు ముందుకు రాగానే టికెట్‌ ఎలా ఇస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ప్రతి కార్యకర్త తన వెంటే ఉన్నారని.. భర్త చాటు భార్యగా టికెట్‌ అడగడం లేదని.. మగవారు పని చేసిన దానికంటే 10 రెట్లు మెరుగ్గా పని చేశానన్నారు. వెనక్కి తగ్గేది లేదని.. కచ్చితంగా నామినేషన్‌ వేస్తానని.. బీ–ఫాం తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, హైదరాబాద్‌కు వెళ్లి రావు పద్మ.. బీజేపీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు)మంత్రి శ్రీనివాస్‌ను కలిశారు. తనకు టికెట్‌ కేటాయించకుండా.. ధర్మారావుకు ఏ ప్రాతిపదికన కేటాయిస్తారని నిలదీశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement