జీ హుజూర్‌లకే ‘కీ’ పోస్టింగ్‌లు! | Sakshi
Sakshi News home page

జీ హుజూర్‌లకే ‘కీ’ పోస్టింగ్‌లు!

Published Sat, Oct 25 2014 3:19 AM

Telangana CM KCR Green Signal to Officers Transfers ...

* నచ్చినవారికిమెచ్చిన చోట పోస్టింగ్
* ఎవరు కావాలో.. ఎవరు వద్దో పేర్లు ఇవ్వండి
* అధికారుల బదిలీలకు సీఎం గ్రీన్‌సిగ్నల్
* జాబితా ఇవ్వాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకు నిర్దేశం

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  జిల్లా పాలనాయంత్రాంగంపై పట్టు బిగించేందుకు అధికార పార్టీ ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టింది. విధేయతకు పెద్దపీట వేయాలని భావిస్తున్న కేసీఆర్ సర్కారు.. మీకు నచ్చిన అధికారుల పేర్లు ఇవ్వాలని పార్టీ ప్రజాప్రతినిధులకు సూచిం చింది. తెలంగాణ  భవన్‌లో శుక్రవారం జిల్లా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. గద్దెనెక్కి ఐదునెలలు కావస్తున్నా, అధికారులు తమను ఖాతరు చేయడంలేదని, చిన్న పనులు కూడా కావడంలేదని కొందరు నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ హయాంలో పనిచేసినవారే ఇప్పటికీ కొనసాగుతున్నారని, వారికి స్థానచలనం కలిగిస్తే తప్ప.. తమ మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి కనిపించడంలేదని సీఎం దృష్టికి తెచ్చారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల వాదనతో ఏకీభవించిన గులాబీ బాస్.. అనుకూలుర జాబితాను రూపొందించాలని సూచించారు.

ఏ అధికారి కావాలో.. ఎవరు వద్దో వీలైనంత త్వరగా సిఫార్సు చేయమని ఆదేశించారు. ఈ నేపథ్యంలో నచ్చినవారిని మెచ్చిన చోట కూర్చోబెట్టే దిశగా ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. కీలక విభాగాల్లో విధేయులకు పోస్టింగ్ ఇచ్చేలా ‘మంత్రా’ంగం నెరుపుతున్నారు. అధికారుల పోస్టింగ్‌ల ప్రతిపాదనలను జిల్లా మంత్రికి సమర్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో తమ విశ్వాసపాత్రులను గుర్తించే పనిలో మునిగిపోయారు. ‘ప్రభుత్వ పనితీరుకు ప్రామాణికంగా నిలవాల్సిన అధికారులే మాకు చికాకులు కలిగిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చిందే తామనే భావనలో వారున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో కనీసం తమను పరిగణించడంలేదు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం’ అని టీఆర్‌ఎస్ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. విధేయతకు గీటురాయిగా ఉండే అధికారుల జాబితాను శనివారం సాయంత్రంలోగా మంత్రి మహేందర్‌రెడ్డికి అందజేస్తామని స్పష్టంచేశారు.
 
అధికారుల్లో గుబులు..
అధికారులకు బదిలీల ఫీవర్ పట్టుకుంది. ‘మాట వినని అధికారులకు ‘దారి’ చూపాల్సిందే’నని పార్టీ నేతలు తేల్చిచెప్పడం.. కేసీఆర్ కూడా పచ్చజెండా ఊపడంతో యంత్రాంగంలో కలవరం మొదలైంది. సుదీర్ఘకాలంగా ఒకేస్థానంలో తిష్టవేసిన ఎంపీడీఓలను కదలించాలనే పట్టుదల అధికారపార్టీలో కనిపిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కీలక భూమిక పోషించే వీరిలో చాలా మంది తెలంగాణేతరులు కూడా ఉండడంతో వీరిని ఇక్కడి నుంచి సాగనంపాలనే చర్చ జరుగుతోంది. మరోవైపు హాట్‌సీట్లుగా భావించే శివారు మండలాల్లో తహసీల్దార్లుగా తమవారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికశాతం తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. అయితే, ఈ పోస్టింగ్‌లపై ఉద్యోగసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

పాత మండలాల్లో పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేరే చోటకు బదిలీ చేయడంపై నిరసన వ్యక్తం చేశాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన తమకు అన్యాయం జరిగిందనే వాదన వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా జరిగే బదిలీలు అధికారపార్టీకి తలనొప్పి కలిగించే అవకాశంలేకపోలేదు. మరోవైపు జిల్లా ఉన్నతాధికారులు కూడా బదిలీల జాబితాల్లో ఉంటారనే ప్రచారం ఊపందుకుంది. అఖిల భారత సర్వీసు(ఏఐఎస్)ల అధికారుల విభజన ప్రక్రియ దాదాపు ముగిసిన క్రమంలో ఈ స్థాయి అధికారులకు కూడా స్థానమార్పిడి ఉండే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఆంధ్రా కేడర్‌కు కేటాయించిన గ్రామీణ ఎస్పీ, వికారాబాద్ సబ్‌కలెక్టర్‌ను ట్రాన్స్‌ఫర్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా కీలక శాఖల్లో కొలువుదీరిన ఆంధ్ర ప్రాంత అధికారులను సాగనంపే దిశగా అధికారపార్టీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.

Advertisement
Advertisement