స్పష్టత ఇవ్వండి | Sakshi
Sakshi News home page

స్పష్టత ఇవ్వండి

Published Mon, Sep 8 2014 1:34 AM

telangana cm kcr seeks clarity from centre on state bifurcation law

* విభజన చట్టంపై కేంద్ర హోంమంత్రికి కేసీఆర్ విజ్ఞప్తి
* హైదరాబాద్‌లోని పలు సంస్థల విషయమై ఇరు రాష్ట్రాల మధ్య
* విభేదాలు తలెత్తుతున్నాయని వెల్లడి
* పలు ప్రాజెక్టులకు అనుమతులు, కాంపా నిధుల విడుదలపై పర్యావరణ మంత్రికి విజ్ఞప్తి
* ఐఐఎం, గిరిజన వర్సిటీ, ఎన్‌ఐడీ ఏర్పాటుపై హెచ్‌ఆర్డీ మంత్రికి వినతి
* ఢిల్లీలో ముగిసిన సీఎం పర్యటన
 
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని పలు సంస్థల విషయంగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య విభేదాలు నెలకొన్న దృష్ట్యా దీనిపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. అసలు పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రకారం ఏ ప్రాంతంలోని సంస్థలు ఆ రాష్ట్రానికే చెందుతాయని, కానీ హైదరాబాద్‌లోని సంస్థల విషయంగా వివాదాలు వస్తున్నాయని ఆయనకు వివరించారు. దీనిపై స్పందించిన రాజ్‌నాథ్.. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. కేసీఆర్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ఆదివారంతో ముగిసింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాన మంత్రితోపాటు కేంద్ర మంత్రులకు శాఖల వారీగా కేసీఆర్ పలు విజ్ఞప్తులు చేశారు.

రాజ్‌నాథ్‌తో భేటీ..
కేసీఆర్ తొలుత పార్టీ ఎంపీలతో కలసి ఆదివారం ఉదయం 11.50 గంటల సమయంలో హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తొలుత కేసీఆర్, రాజ్‌నాథ్‌సింగ్ దాదాపు పది నిమిషాల పాటు పలు అంశాలపై ఏకాంతంగా చర్చించుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. అనంతరం పార్టీ ఎంపీలు కె.కేశవరావు, ఏపీ జితేందర్‌రెడ్డి, వినోద్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రకారం ఏ రాష్ట్రంలోని సంస్థలు ఆ రాష్ట్రానికే చెందుతాయని, కానీ హైదరాబాద్‌లోని కొన్ని సంస్థల విషయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మధ్య విభేదాలు తలెత్తుతున్నాయని.. దీనిపై స్పష్టత ఇవ్వాలని కేసీఆర్ కోరారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని రాజ్‌నాథ్ కేసీఆర్‌కు హామీ ఇచ్చినట్టు సమాచారం.

పర్యావరణ అనుమతులివ్వండి..
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు, సింగరేణి విస్తరణ పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతులు వెంటనే లభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను సీఎం కేసీఆర్ కోరారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో శాస్త్రిభవన్‌లో జవదేకర్‌తో కేసీఆర్ దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అడవుల పెంపకానికి సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 1,100 కోట్ల కాంపా (సీవోఎంపీఏ- అటవీ పెంపక పరిహారం) నిధులను వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ కోరగా... జవదేకర్ సమ్మతించారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అటవీకరణకు నిధులను పదిశాతం నుంచి 30 శాతానికి పెంచాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఐఐఎం ఏర్పాటు చేయండి...
హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని కేంద్ర  మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీని కేసీఆర్ కోరారు. దీంతోపాటు హైదరాబాద్‌లో ఇప్పటికే శంకుస్థాపన జరిగిన నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని.. విభజన బిల్లులో పేర్కొన్న ప్రకారం గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఐఐఎంకు నిధులు కేటాయించలేకపోయినా.. వచ్చే బడ్జెట్‌లో తప్పక పరిశీలిస్తామని ఈ సందర్భంగా స్మృతి ఇరానీ హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో మహిళా హాస్టళ్ల నిర్మాణానికి సైతం కేంద్ర నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి హామీ ఇచ్చినట్టు టీఆర్‌ఎస్ ఎంపీలు తెలిపారు. త్వరలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ‘కేజీ టు పీజీ’ పథకం అంకురార్పణకు ముఖ్య అతిథిగా రావాలని స్మృతి ఇరానీని కేసీఆర్ ఆహ్వానించగా... మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
 
చానళ్ల నిలిపివేతలో సర్కారు పాత్ర లేదు!
తెలంగాణలో రెండు న్యూస్ చానళ్ల నిలిపివేతలో తెలంగాణ ప్రభుత్వ పాత్ర ఏమీ లేద ని, ఈ అంశం పూర్తిగా ఆయా న్యూస్ చానళ్ల యాజమాన్యాలు, ఎంఎస్‌వోలు, తెలంగాణ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని జవదేకర్ అభిప్రాయపడినట్టు టీఆర్‌ఎస్ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ న్యూస్ చానళ్లను నిలిపివేసిన అంశాన్ని ఆయన ప్రస్తావించినట్లు చెప్పారు. ఈ సమావేశాల్లో కేసీఆర్‌తోపాటు పార్టీ ఎంపీలు కె.కేశవరావు, ఏపీ జితేందర్‌రెడ్డి, వినోద్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితోపాటు తెలంగాణ ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు , ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.
 
హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనతో పాటు ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, కె.విశ్వేశ్వర్‌రెడ్డి, కేసీఆర్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు కేసీఆర్ వెంట వచ్చిన వారిలో ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement