'సభలో టీఆర్ఎస్ సభ్యులకే మాట్లాడే అవకాశం' | Sakshi
Sakshi News home page

'సభలో టీఆర్ఎస్ సభ్యులకే మాట్లాడే అవకాశం'

Published Tue, Nov 18 2014 1:49 PM

'సభలో టీఆర్ఎస్ సభ్యులకే మాట్లాడే అవకాశం' - Sakshi

హైదరాబాద్: అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యులకే మాట్లాడే అవకాశం ఇస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టి. జీవన్రెడ్డి, జి.గీతారెడ్డి ఆరోపించారు. తమపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా స్పీకర్ ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం టీ కాంగ్రెస్ సభ్యులు సస్పెన్షన్కు గురైన అనంతరం అసెంబ్లీ వెలుపల టి. జీవన్రెడ్డి, జి.గీతారెడ్డి మాట్లాడుతూ... ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ఇదే అంశంపై ఈ రోజు సాయంత్రం గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అవసరమైతే ఫిరాయింపులపై న్యాయస్థానంలో కూడా పోరాడతామని స్పష్టం చేశారు. 

అదే సమయంలో అక్కడే ఉన్న మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, డీకే అరుణ మాట్లాడుతూ... పార్టీ ఫిరాయింపులతో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న కేసీఆర్ తీరుపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చామని తెలిపారు. ఈ తీర్మానం నిబంధనలకు వ్యతిరేకమంటూ మంత్రి హరీష్రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

ఫిరాయింపులను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని వారు హెచ్చరించారు. సీఎంగా కేసీఆర్ని అనర్హుడిగా ప్రకటించాలని గవర్నర్ను కలుస్తామని డీకే అరుణ, మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఫిరాయింపులపై చర్చకు ప్రతిపక్షం పట్టుపట్టింది. అందుకు అధికార పక్షం ససేమిరా అంది. దీంతో ప్రతిపక్షం సభ జరగకుండా అవాంతరాలు సృష్టించింది. దాంతో  13 మంది కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement