తెలంగాణ అభివృద్ధి బాధ్యత అందరిది | Sakshi
Sakshi News home page

తెలంగాణ అభివృద్ధి బాధ్యత అందరిది

Published Mon, Jul 21 2014 2:17 AM

telangana development is all responsibility says kodandaram

ఘట్‌కేసర్: అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని టీజేఏసీ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. మండలంలోని కొర్రెములలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో కోదండరామ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గుప్పెడు మంది ఆంధ్రనాయకులు తెలంగాణ ప్రాంతంలో నీళ్లను, ఉద్యోగాలను, విధులను మనకు కాకుండా చేశారన్నారు.

అమరవీరుల కుటుంబాలను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న చెరువులను బాగు చేసుకోవాలన్నారు. తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసేటట్లు ప్రొత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ, మత్స పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలను ఏర్పాటుచేయాలని, వాటిల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపడుతానే పేదలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. గతంలో నగరానికి అవసరమైన పాలు రంగారెడ్డి జిల్లా నుంచే వచ్చేవని, ప్రస్తుతం ఎక్కడ చూసినా పాల పాకెట్ల హవా నడుస్తోందన్నారు.

 ఈ పరిస్థితి మారాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిధులు ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా వినియోగించడానికే ‘మన ఊరు-మన ప్రణాళిక’ తీసుకువచ్చినట్లు చెప్పారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో  టీజేఏసీ కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య, జేఏసీ జిల్లా తూర్పు విభాగపు కన్వీనర్ సంజీవరావు, జెడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గొంగళ్లస్వామి, మండల ఉపాధ్యక్షుడు గ్యార లక్ష్మయ్య, మండల జేఏసీ కన్వీనర్ మారాం లకా్ష్మరెడ్డి, సర్పంచ్ బైరగాని నాగరాజ్, ఉపసర్పంచ్ నాగార్జున,  మాజీ సర్పంచ్‌లు కృష్ణ, కవిత, కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement