తెలంగాణ అభివద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం | Sakshi
Sakshi News home page

తెలంగాణ అభివద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం

Published Fri, Mar 14 2014 11:34 PM

telangana development possible with kcr

గజ్వేల్ రూరల్/జోగిపేట/మెదక్ టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి రాజయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం గజ్వేల్, జోగిపేట, మెదక్ పట్టణాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించుకున్నామన్నారు. టీఆర్‌ఎస్ ప్రజలకు ప్రధానమైన పలు హామీలు ఇచ్చిందని వాటిని నెరవేర్చేందుకు అధికారంలోకి రావాల్సి ఉందన్నారు.

 కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తేలేదు..
 తెలంగాణ తెచ్చింది తామేనని కాంగ్రెస్ నాయకులు  చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని రాజయ్య యాదవ్ అన్నారు. 60 ఏళ్ల పోరాటం, 1,200 మంది విద్యార్థులు, యువకుల బలిదానాలు చేసుకున్నా స్పందించని కాంగ్రెస్ నేతలకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం అని చెప్పుకోవడం సరికాదన్నారు. వెనుక బడిన తెలంగాణ ప్రాంతాన్ని వదిలి సీమాంధ్ర ప్రాంతానికి ప్యాకేజీ ఇవ్వడం దారుణమన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ప్రసక్తేలేదని రాజయ్య యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ కీలకపాత్ర కీలకమని, పునర్నిర్మాణంలోనూ టీఆర్‌ఎస్ ప్రధాన భూమిక పోషించాల్సి ఉన్నందున ఒంటరి పోరుకు మొగ్గు చూపుతున్నామన్నారు.

 చంద్రబాబు తెలంగాణకు సీఎం అవుతావా?
 తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటించిన చంద్రబాబు తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. తెలంగాణలో దుకాణాన్ని మూసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ప్రాంతానికి బీసీ అభ్యర్థిని సీఎం చేస్తాననడం  హాస్యాస్పదమని రాజయ్య యాదవ్ అన్నారు. చంద్రబాబు పరిపూర్ణత గల రాజకీయ నాయకుడైతే తెలంగాణకు సీఎం కావాలని సవాల్ విసిరారు. తెలంగాణ వచ్చే చివరి క్షణం వరకు కూడా అడ్డుకునేందుకు అన్ని జాతీయ పార్టీల నేతల కాళ్లు పట్టుకొని బతిమాలిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ర్ట కార్యదర్శి ఎం.దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ లావణ్య, అందోల్ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.కిష్టయ్య, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూంరెడ్డి, రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement