ఇక అసలు పోరు | Sakshi
Sakshi News home page

ఇక అసలు పోరు

Published Mon, Nov 12 2018 9:04 AM

Telangana Elections Nomination Release Today - Sakshi

సాక్షి, మెదక్‌: అసెంబ్లీ ఎన్నికల అసలు పోరు సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల కమిషన్‌ సోమవారం ఉదయం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దీంతో సోమవారం నుంచి ఎన్నికలు జరిగే డిసెంబర్‌ 7వ తేదీ వరకు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు ఆ పార్టీ బీఫారాలు అందజేసింది. దీంతో నామినేషన్లు వేసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు సిద్ధం అవుతున్నారు. కాగా మహాకూటమి, బీజేపీలు ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో రెండు పార్టీల నాయకుల్లో అసహనం వ్యక్తం అవుతోంది.

మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.మెదక్, నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మెదక్, నర్సాపూర్‌ ఆర్డీఓలు రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా వ్యవహరిస్తూ నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపడుతోంది. 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్‌ 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు మరో 26 రోజులే మిగిలి ఉండటంతో పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.

అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు గత నెల 6న ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి జిల్లాలో ఎన్నికల వాతావరణం నెలకొంది.ఎన్నికల రేసులో టీఆర్‌ఎస్‌ పార్టీ ముందుండగా మిగతా రాజకీయ పార్టీలు వెనుకంజలో ఉన్నాయని చెప్పవచ్చు.టీఆర్‌ఎస్‌ అన్ని రాజకీయ పార్టీలకంటే ముందుగానే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు ఎన్నికల ప్రచారం ప్రారంభించి నెల రోజులు దాటింది. బీఎల్‌ఎఫ్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం ప్రచారం కొనసాగిస్తున్నారు. కాగా మహాకూటమి అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనా ఇంకా కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

నామినేషన్ల దిశగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆదివారం ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బీఫారాలు అందజేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ దిశానిర్దేశనం చేసినట్లు తెలుస్తోంది. మహాకూటమి అభ్యర్థులకు దీటుగా ప్రచారం నిర్వహించాలని, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టాలని సూచించినట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయ్యేవరకు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని, పార్టీ  శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో గెలిచి రావాలని కేసీఆర్‌ ఎమ్మెల్యే అభ్యర్థులకు హితబోధ చేసినట్ల తెలుస్తోంది. అలాగే మెదక్‌ జిల్లాలో తన ప్రచారం తేదీల గురించి కేసీఆర్‌ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. బీఫారాలు అందుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందేర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. అలాగే సోమవారం నుంచి ప్రచారం ముమ్మరం చేయనున్నారు. 

కాంగ్రెస్, బీజేపీల్లో ఇంకా సస్పెన్సే.. 
కాంగ్రెస్, బీజేపీలు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదు. సోమవారం నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నా అభ్యర్థులను ప్రకటించకపోవడంపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మహాకూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటుపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో మెదక్, నర్సాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదు. నర్సాపూర్‌ నుంచి మాజీ మంత్రి సునీతారెడ్డికి టికెట్‌ ఖరారు కాగా మెదక్‌ నుంచి ఎవరు పోటీ చేస్తారా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. పొత్తులో భాగంగా టీజేఎస్‌ మెదక్‌ అసెంబ్లీ స్థానం కోసం పట్టుబడుతోంది. అయితే కాంగ్రెస్‌ ఆశావహులు మాజీ ఎంపీ విజయశాంతి ద్వారా మెదక్‌ టీజేఎస్‌కు వెళ్లకుండా ఒత్తిడి తీసుకువస్తున్నారు. టీజేఎస్‌ నేతలు మాత్రం మెదక్‌ నుంచి తామే పోటీ చేస్తామని చెబుతున్నారు. మహాకూటమి అభ్యర్థుల ప్రకటనకు మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది.

బీజేపీ సైతం మెదక్, నర్సాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే మెదక్‌ నుంచి రాష్ట్ర నాయకుడు రాజయ్య పోటీ చేయడం ఖాయమైనట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి ఆయన నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నర్సాపూర్‌ టికెట్‌ కోసం బీజేపీ నాయకులు రఘువీర్, గోపీ పోటీపడుతున్నారు. ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్‌ దక్కే అవకాశం ఉంది. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నా బీజేపీ అభ్యర్థులను ప్రకటించకపోడంపై ఆ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీఎల్‌ఎఫ్‌ మెదక్‌ ఎమ్మెల్యే అభ్యర్థి దూడ యాదేశ్వర్‌ సోమవారం నామినేషన్‌ వేయనున్నారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఎ.మల్లేశం 16న నామినేషన్‌ వేయనున్నారు. 

                    
   జిల్లాలోని                       మెదక్,                  
నియోజకవర్గాలు :           నర్సాపూర్‌                              
                           
జిల్లాలో ఓటర్ల సంఖ్య       :     3,92,606
మొత్తం పోలింగ్‌ కేంద్రాలు  :     538
పోలింగ్‌ సిబ్బంది            :     3276
ఓటింగ్‌ యంత్రాలు         :     655
వీవీ ప్యాట్‌లు               :     683

ఎన్నికల షెడ్యూల్‌ వివరాలు..
ఎన్నికల నోటిఫికేషన్‌           :    ఈ నెల 12
నామినేషన్లకు గడువు          :    ఈ నెల 19
నామినేషన్ల పరిశీలన           :    ఈ నెల  20 
ఉపసంహరణకు గడువు       :    ఈ నెల 22
పోలింగ్‌ తేదీ                       :   డిసెంబరు 7
ఓట్ల లెక్కింపు తేదీ              :   డిసెంబరు 11


నేటి నుంచి నామినేషన్లు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
మెదక్‌ అర్బన్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్న విషయం తెలిసిందే. మెదక్‌ నియోజకవర్గానికి సంబంధించి మెదక్‌ పట్టణంలోని పాత డీపీఆర్‌ఓ కార్యాలయంలో, నర్సాపూర్‌లోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. మెదక్‌ రిటర్నింగ్‌ అధికారి వీరబ్రహ్మచారి, నర్సాపూర్‌లో రిటర్నింగ్‌ అధికారి వెంకటేశ్వర్లు ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.

నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం ఆయా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే నామినేషన్‌ వేసేందుకు అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది.  నామినేషన్ల స్వీకరణ కోసం ఆయా నియోజకవర్గాల్లోని కార్యాలయాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.  

Advertisement
Advertisement