గ్లోబల్‌ సీడ్‌ వ్యాలీగా తెలంగాణ  | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ సీడ్‌ వ్యాలీగా తెలంగాణ 

Published Wed, Jun 27 2018 1:19 AM

Telangana as global seed valley - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్లోబల్‌ సీడ్‌ వ్యాలీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తామని జర్మనీ ఆహార, వ్యవసాయ మంత్రి జూలియా క్లోవిక్నర్‌ హామీ ఇచ్చారు. ప్రపంచ ఆహార సదస్సు–2018లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి ఎమ్మె ల్యే సీహెచ్‌ రమేశ్, రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ కేశవులు జర్మనీ వెళ్లారు. ఈ సందర్భంగా మంగళవారం జర్మనీ విత్తన ప్రముఖులతో అక్కడ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్లోవిక్నర్‌ తెలంగాణ రాష్ట్రం విత్తన ధ్రువీకరణ కింద పలు దేశాలకు విత్తనాలు ఎగుమతి చేయడాన్ని అభినందించారు. తెలంగాణను గ్లోబల్‌ సీడ్‌ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు ఆ రాష్ట్రంలో గ్లోబల్‌ సీడ్‌ అడ్వయిజరీ బాడీ, ఇండో–జర్మన్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విత్తనోత్పత్తికి, విత్తన ప్రాసెసింగ్‌కు తెలంగాణలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న విత్తనాలను దిగుమతి చేసుకోవడానికి చాలా దేశాలు ఎదురుచూస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎద్దుమైలారంలో 100 ఎకరాల్లో సీడ్‌ వ్యాలీని ఏర్పాటు చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జర్మనీ–తెలంగాణ మధ్య ఉన్న ఇండో–జర్మన్‌ ప్రాజెక్టును మరో మూడేళ్లు పొడిగిస్తున్నామన్నారు.  

అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం.. 
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పంపిన లేఖను క్లోవిక్నర్‌కు ఎమ్మెల్యే రమేశ్, డాక్టర్‌ కేశవులు అందజేశారు. వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ ఇస్టా కాంగ్రెస్‌కు హాజరుకావాల్సిందిగా కేటీఆర్‌ ఆ లేఖలో ఆయనకు విజ్ఞప్తి చేశారు.

ఆసియాలోనే మొదటిసారిగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని, పలు దేశాల నుంచి విత్తన నిపుణులు, విత్తన శాస్త్రవేత్తలు పాల్గొంటారని తెలిపారు. ప్రపంచ ఆహార సదస్సుకు కొన్ని కారణాల వల్ల తాను హాజరుకాలేకపోతున్నానని చెప్పారు. ప్రపంచ విత్తన భాండాగారం దిశగా తెలంగాణ పయనిస్తున్న సమయంలో నాణ్యమైన విత్తనోత్పత్తికి, విత్తన ప్రాసెసింగ్, విత్తన ఎగుమతికి సహకరిస్తున్న ఇండో–జర్మన్‌ ప్రాజెక్టు నిర్వహకులకు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement