కాళోజీ కళాక్షేత్రం | Sakshi
Sakshi News home page

కాళోజీ కళాక్షేత్రం

Published Wed, Sep 3 2014 3:02 AM

కాళోజీ కళాక్షేత్రం - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘ఉదయంకానే కాదనుకోవడం నిరాశ... ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ’ అంటూ గొప్ప సత్యాన్ని సులభంగా వివరించారు కాళోజీ నారాయణరావు. అన్యాయాన్ని ఎదిరించాలని రాయడమే కాకుండా చేసి చూపించిన కాళోజీ.. ప్రజా కవిగా మాత్రమే కాకుండా ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి చిరునామాగా నిలిచిన కాళోజీ నారాయణరావుకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 
1914, సెప్టెంబరు 9న జన్మించిన కాళోజీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 9న కాళోజీ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగం గా హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం(కల్చరల్ సెం టర్) ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం హయగ్రీవాచారి మైదానంగా పిలుస్తున్న ప్రాంతంలోని మూడు ఎకరాల విస్తీర్ణంలో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేయనున్నారు. దీని కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 9న ఉదయం వరంగల్ నగరానికి వస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా తొలిసారి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాగం, టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
 
కాళోజీకి పెద్దపీట...
పోరాటాలు, రచనలతో సామాజిక, తెలంగాణ ఉద్యమాల్లో ముందుండి నడిచిన కాళోజీ నారాయణరావుకు గుర్తింపుగా ఆయన సొంత ప్రాంతమైన జిల్లా కేంద్రంలో కళా క్షేత్రం ఏర్పాటు చేస్తున్నారు. కళలకు, కళా ప్రదర్శనలకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న హైదరాబాద్ రవీంద్రభారతికి దీటుగా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించనున్నారు.
 
కాళోజీ రచనలను, ఆయన జ్ఞాపకాలకు సంబంధించిన అంశాలను ఈ క్షేత్రంలో పెట్టనున్నారు. మొదటి నుంచీ కళా, సాంస్కృతిక రంగాలకు చిరునామాగా ఉన్న వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటు చేస్తే ఈ రంగాలకు మరింత గుర్తింపు రానుంది. కళా క్షేత్రం నిర్మాణం తీరు ఎలా ఉండాలనే అంశంపై నిర్మాణ నిపుణులకు బాధ్యతలు అప్పగించారు.  కళాక్షేత్రం నిర్మాణ ప్రక్రియను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చేపడుతోంది.

Advertisement
Advertisement