భూమి హక్కు పక్కా | Sakshi
Sakshi News home page

భూమి హక్కు పక్కా

Published Thu, May 2 2019 1:30 AM

Telangana Government Plans To New Land Act - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కంక్లూజివ్‌ టైటిల్‌’... సీఎం కేసీఆర్‌ చెప్పిన ఈ మాట గురించి రెవెన్యూ శాఖలో పెద్ద చర్చే జరుగుతోంది. భూ యాజమాన్య హక్కు వివాదాలకు శాశ్వతంగా తెరదించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రతిపాదన అమలు సాధ్యాసాధ్యాలపై అధికారుల్లో లోతైన చర్చ జరుగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినా చరిత్ర, భవిష్యత్తుతోపాటు వర్తమానాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో ముందడుగు వేయాల్సి ఉంటుందని, లేదంటే మున్ముందు భూ సమస్యలు మరింత పెరిగిపోతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టైటిల్‌ గ్యారంటీ ఇచ్చే విషయంలో పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత కొత్త రెవెన్యూ చట్టంలో భూ యాజమాన్య హక్కులపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నాణేనికి అటూ... ఇటూ
కొత్త రెవెన్యూ చట్టంపై మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం మూడు మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి నిజాం కాలంలో ప్రవేశపెట్టిన తెలంగాణ ల్యాండ్‌ రెవెన్యూ యాక్ట్‌–1907కు ప్రాణం పోయడం, రెండోది ప్రస్తుతం అమల్లో ఉన్న రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌వోఆర్‌–1971) చట్టానికి మార్పులు చేయడం, మూడోది టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావడం. ఈ మూడింటిలో అత్యుత్తమమైనదిగా టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని ప్రభుత్వం పరిగణిస్తోంది. తద్వారా పట్టాదారులకు భూమిపై పక్కాగా హక్కులు రావడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలకు తావుండదని అంచనా వేస్తోంది. అయితే ప్రభుత్వ ప్రతిపాదన, ముఖ్యమంత్రి ఆలోచన సాకారం కావాలంటే దీని అమల్లో ఎదురయ్యే కష్టసాధ్యాలపై మరింత కసరత్తు అవసరమని నిపుణులు అంటున్నారు. టైటిల్‌ గ్యారెంటీపై రెవెన్యూశాఖలో జరుగుతున్న చర్చ ప్రకారం రికార్డులు అప్‌డేట్‌గా తప్పులు లేకుండా ఉంటేనే టైటిల్‌ గ్యారెంటీపై ముందుడుగు వేయగలమని, అది కూడా హద్దులు నిర్ధారించాకే సాధ్యపడుతుందని చెబుతున్నారు.

ఒకసారి టైటిల్‌ గ్యారెంటీని గనుక అమలు చేస్తే రికార్డులను సవరించే వీలుండదు. ఒకవేళ భవిష్యత్తులో సదరు టైటిల్‌లో గనుక తప్పులున్నట్లు తేలితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు భూ యజమానులకు నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తప్పులను పూర్తిస్థాయిలో సవరించి రెవెన్యూ రికార్డులను పటిష్టంగా రూపొందించాల్సి ఉంటుంది. అమెరికాలోని ఒకట్రెండు రాష్ట్రాలు నష్టపరిహారం భారం కావడంతో టైటిల్‌ గ్యారెంటీ నుంచి వెనక్కి తగ్గాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తెస్తున్న కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో మరింత జాగ్రత్త అవసరం కానుంది. మరోవైపు బీమా కంపెనీలు కూడా రికార్డులు పక్కాగా ఉంటేనే బీమా వర్తింపజేస్తాయి. ఇప్పటికే భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం కూడా రికార్డుల్లో తప్పులు దొర్లాయని కోకొల్లలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ తప్పులను సరిచేసేందుకు అవకాశం ఇచ్చాకే టైటిల్‌ గ్యారెంటీని అమల్లోకి తేవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పహాణీలు బ్యాక్‌ ఎండ్‌లోనే...
కొత్త చట్టాన్ని తీసుకొస్తే ఇన్నాళ్లూ రెవెన్యూ రికార్డుల మాతృకగా ఉన్న పహాణీలు రికార్డులుగా మిగిలిపోనున్నాయి. వాటి ప్రామాణికంగానే రికార్డులను అప్‌డేట్‌ చేస్తారు గనుక.. జాగ్రత్తగా భద్రపరుస్తారు. పహాణీల్లో నిక్షిప్తమైన సమాచారం మేరకు 1బీ రికార్డులను పటిష్టం చేస్తే సరిపోతుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫలానా వ్యక్తికి ఫలానా భూమి ఎక్కడి నుంచి వచ్చిందన్న సమాచారం 1బీ రికార్డుల్లో ఉంటుంది కనుక ఈ రికార్డులను పూర్తిస్థాయిలో పటిష్టంగా తయారు చేస్తే భవిష్యత్తులో సమస్యలు రావని భావిస్తున్నాయి. 1బీ రికార్డులను గ్రామ సభల్లో ప్రదర్శించి తప్పులు సరిదిద్దితే సమస్యలకు ముగింపు పలక వచ్చని అంచనా వేస్తున్నాయి. కొత్త చట్టం అమల్లో ఉండే ఇబ్బందులు సహజమే కానీ అంతిమంగా రైతుకు తన భూమిపై హక్కులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనికితోడు ప్రస్తుతమున్న ఇనాం, వక్ఫ్, దేవాదాయ, భూదాన్, రక్షిత కౌలుదారు తదితర చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా భూ వివాదాలకు అంతిమ పరిష్కారం తీసుకురాగలమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.  

భూములు పరాధీనమైతే?
టైటిల్‌ గ్యారంటీ చట్టం అమల్లోకి వస్తే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యే అవకాశం లేకపోలేదు. కంక్లూజివ్‌ టైటిల్‌ యాక్ట్‌ ప్రకారం నిర్దేశిత భూమిపై ఆరు నెలల్లోగా అభ్యంతరాలు వస్తే సరి. లేకుంటే సదరు భూమిని క్లియర్‌ టైటిల్‌గా పరిగణించి క్లెయిమ్‌ చేసిన పట్టాదారుకు యాజ మాన్య హక్కు కల్పించాల్సి ఉంటుంది. దీనివల్ల చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని బడా బాబులు, భూ మాఫియా సర్కారు భూములపై హక్కులను సంపాదించే అవకాశమూ లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపడం ద్వారానే టైటిల్‌ గ్యారంటీ పారదర్శకంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది.  
 

Advertisement
Advertisement