ప్రణాళికేతర పద్దుకు కళ్లెం | Sakshi
Sakshi News home page

ప్రణాళికేతర పద్దుకు కళ్లెం

Published Tue, Jan 19 2016 4:14 AM

telangana government plans to hold non planned costing

- వచ్చే ఏడాది రూ. 8,100 కోట్ల అదనపు భారం
- పెరగనున్న విద్యుత్, బియ్యం సబ్సిడీలు
- ఉద్యోగుల డీఏల భారం రూ. 2,100 కోట్లు
- పీఆర్‌సీ బకాయిలు రూ. 3,000 కోట్లు
- దుబారాను తగ్గించేందుకు సర్కారు సంస్కరణలు
- ఫిబ్రవరి చివర్లోనే రాష్ర్ట బడ్జెట్ సమావేశాలు
 
సాక్షి, హైదరాబాద్:
వచ్చే ఏడాది బడ్జెట్ ఆదాయపు వృద్ధికి తగ్గట్లుగానే అంతకంతకు పెరిగిపోనుంది. 2016-17 బడ్జెట్ దాదాపు రూ. 1.27 లక్షల కోట్లకు చేరుతుందని గతంలోనే సీఎం కేసీఆర్ సంకేతాలిచ్చారు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో పన్నులు, పన్నేతర ఆదాయం 15 శాతం వృద్ధి చెందింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రాజెక్టుల రీ డిజైనింగ్, వివిధ పథకాలకు నిర్ణీత కేటాయింపులు, వినూత్నంగా ఎంచుకున్న బడ్జెట్ తయారీ పంథాతో కొత్త బడ్జెట్ ఉత్కంఠ రేపుతోంది. శాఖల వారీగా ముందస్తు కేటాయింపుల నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం రూ.62 వేల కోట్లకు ఎగబాకే సంకేతాలు వెలువడ్డాయి.

అదే సమయంలో ప్రణాళికేతర వ్యయం కూడా భారీగా పెరిగిపోనుండటం ఆర్థిక శాఖకు తలపోటుగా మారింది. వీలైనంత మేరకు దుబారాను తగ్గించి ప్రణాళికేతర వ్యయానికి కళ్లెం వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా కొన్ని సంస్కరణలు తప్పవని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వ కొత్త నిర్ణయాల భారం వచ్చే బడ్జెట్‌పై పడనుంది. 2015-16 బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం రూ.63 వేల కోట్లు. అందులో దాదాపు రూ.40 వేల కోట్లు ఉద్యోగుల జీతభత్యాలకే పోయాయి. కరువుభత్యాల భారం ఏటా దాదాపు రూ.1,400 కోట్లు పెరిగిపోతుంది. జూన్ నుంచి చెల్లించాల్సిన కరువుభత్యాన్ని ఇప్పటికీ చెల్లించలేదు.

దీంతో మరో రూ.700 కోట్ల భారం తప్పదు. వీటికి తోడు ఉద్యోగులకు పీఆర్‌సీ అమలైనప్పటి నుంచి చెల్లించాల్సిన తొమ్మిది నెలల బకాయిలు దాదాపు రూ.3వేల కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుతో ఏటా రూ.400 కోట్ల మేరకు భారం పడుతుంది. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటంతో మరో రూ.600 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. వీటికితోడు విద్యుత్తుకు ప్రభుత్వం చెల్లించే సబ్సిడీ సుమారు రూ.1000 కోట్లు పెరగనుంది. సన్న బియ్యం పథకంతో సబ్సిడీ భారం రూ.500 కోట్ల మేరకు ఉంటుందని అంచనా.

ప్రస్తుతం ప్రభుత్వం తెచ్చిన అప్పులకు రూ.800 కోట్లు వడ్డీలు చెల్లిస్తుండగా, ఈ భారం మరో రూ.500 కోట్లు పెరిగిపోనుంది. దీంతో రూ.8,100 కోట్ల మేరకు ప్రణాళికేతర వ్యయం పెరిగిపోవటం ఖాయమైంది. దీంతో వచ్చే బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం రూ.70 వేల కోట్లు దాటిపోనుంది. కానీ వాస్తవ ఆదాయ వనరులకు తగ్గట్లుగా వీలైనంత మేరకు ఈ ఖర్చును తగ్గించాలని ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అక్కర్లేని పథకాలను పూర్తిగా రద్దు చేయటంతో పాటు ఉద్యోగుల టీఏ, డీఏలు, వాహనాల నిర్వహణ ఖర్చులన్నింటినీ భారీగా తగ్గించాలని భావిస్తోంది.

మిగతా పద్దులతో ఇబ్బంది
భూముల అమ్మకం ద్వారా వస్తుందనుకున్న ఆదాయం రాకపోవడం, కేంద్రం నుంచి ఆశించినన్ని గ్రాంట్లు, నిధులు రాకపోవటంతో ఈ ఏడాది రాష్ట్ర ఖజానాను ఇరకాటంలో పడేసింది. పన్నులు, పన్నేతర ఆదాయం పెరిగినప్పటికీ మిగతా పద్దులు రాకపోవటంతో బడ్జెట్ సైతం అంచనాలను అందుకోలేకపోయింది. అందుకే ఈసారి బడ్జెట్‌లో వీలైనంత మేరకు వాస్తవిక అంచనాలు ఉండేలా కసరత్తు చేస్తోంది.

ఫిబ్రవరిలోనే బడ్జెట్ సమావేశాలు
కేంద్రం ఫిబ్రవరి 29న బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఈసారి కేంద్ర బడ్జెట్ కంటే ముందే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆ దిశగా బడ్జెట్ తయారీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు మొదలవుతాయనేది ఆసక్తి రేపుతోంది. ఫిబ్రవరి 2న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, 13న నారాయణఖేడ్ ఉప ఎన్నిక జరగనున్నాయి. అధికార పార్టీ సహా రాజకీయ పక్షాలన్నీ ఈ ఎన్నికల కోలాహలంలో ఉన్నాయి. దీంతో ఎన్నికలు ముగిసిన వెంటనే ఫిబ్రవరి మూడో వారంలో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించి.. కేంద్ర బడ్జెట్ కంటే ముందే ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ ఇప్పటికే శాఖల వారీగా ప్రణాళిక వ్యయ కేటాయింపులు, జిల్లాల వారీగా అభివృద్ధి కార్డుల తయారీ ప్రక్రియలో నిమగ్నమైంది.

Advertisement
Advertisement