స్వచ్ఛ తెలంగాణ.. స్వచ్ఛ భారత్ | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ తెలంగాణ.. స్వచ్ఛ భారత్

Published Thu, Apr 30 2015 3:29 AM

telangana government starts swacha telangana programe

- ‘స్వచ్ఛ భారత్ మిషన్’ పేరు మార్చుతూ సర్కారు నిర్ణయం
 
హైదరాబాద్:
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్‌ను రాష్ట్రంలో ‘స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ భారత్’ పథకంగా అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇంతకు మునుపు ఈ కార్యక్రమాన్ని ‘స్వచ్చ భారత్ గ్రామీణ మిషన్’గా అమలు చేయాలనుకున్న ప్రభుత్వం తాజాగా ఈ పేరును ఖరారు చేసింది.  ఈ కార్యక్రమం అమల్లో భాగంగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో సుమారు 6.5 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో టాయిలెట్‌కు రూ.12 వేలు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఇందులో 75 శాతం (రూ.9 వేలు) కేంద్ర ప్రభుత్వ, 25 శాతం(రూ.3 వేలు) రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.
 
 వెనుకబడిన మండలాలకు ప్రాధాన్యం..
 
 తొలిదశలో వెనుకబడిన మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభించాలని, వందశాతం నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన గ్రామాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సర్కారు సూచించింది. ఎస్సీ ఎస్టీ వర్గాలుండే ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మాణానికి సబ్‌ప్లాన్ కింద నిధులు కేటాయించనుంది. జిల్లాస్థాయిలో కలెక్టర్లు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
 
 నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్..
 పర్యావరణానికి హాని లేని విధంగా ఇరిగేషన్ శాఖ రిటైర్డు చీఫ్ ఇంజనీర్ ఒకరు రూపొం దించిన బయో డిగ్రేడ్ టాయిలెట్ నమూనాను పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్ జిల్లాలో నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement