జూన్‌ 15న ఇంటర్‌ ‘ద్వితీయ’ ఫలితాలు

31 May, 2020 02:08 IST|Sakshi

పూర్తయిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర మూల్యాంకనం

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలను జూన్‌ 15వ తేదీన విడుదల చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు చర్యలు చేపట్టింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జవాబు పత్రాల మూల్యాంకనం శనివారంతో పూర్తయింది. ప్రస్తుతం స్కానింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఆ తరువాత ఫలితాల ప్రాసెస్‌ చేయాల్సి ఉంది. అయితే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయాలని ఇదివరకే భావించినా అది సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయినా ద్వితీయ సంవత్సరంతోపాటే ప్రథమ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. సాధ్యం కాకపోతే జూన్‌ 15న ద్వితీయ సంవత్సర ఫలితాలను ప్రకటించి ఆ తరువాత రెండు మూడు రోజుల్లో ఫస్టియర్‌ ఫలితాలు విడుదల చేయనుంది. మొత్తానికి జూన్‌ 20వ తేదీలోగా ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక ఈ ఫలితాలు వచ్చాక నెల రోజుల్లో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. వార్షిక పరీక్షలకు హాజరైన వారిలో 30 శాతం మంది వీటికి హాజరు కానున్నారు. టెన్త్‌ ఫలితాలు వచ్చాక ప్రథమ సంవత్సర తరగతులను ప్రారంభించాలని ఇదివరకే నిర్ణయించింది. ఇక ద్వితీయ సంవత్సర తరగతులను జూలై 15 తరువాత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఎంసెట్, నీట్, జేఈఈ ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు.. 
ఎంసెట్, నీట్, జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థుల కోసం మాక్‌ టెస్టులను అందుబాటులోకి తెచ్చినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్‌ పేపర్లు, ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్టులు www.rankersl-earning.comలో పొందవచ్చని తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు