ఫలించిన టీఆర్‌ఎస్ వ్యూహం | Sakshi
Sakshi News home page

ఫలించిన టీఆర్‌ఎస్ వ్యూహం

Published Tue, Jun 2 2015 2:48 AM

ఫలించిన టీఆర్‌ఎస్ వ్యూహం - Sakshi

* స్పష్టమైన అంచనాతోబరిలోకి ఐదో అభ్యర్ధి
* ఒక్క ఓటూ వృథా కాకుండా ప్లాన్
సాక్షి, హైదరాబాద్: సరైన సంఖ్యా బలం లేకుండా ఐదో అభ్యర్థిని ఎలా పోటీ పెడతారంటూ విపక్ష కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు చేసిన విమర్శలను తిప్పికొడుతూ అధికార టీఆర్‌ఎస్... ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులనూ గెలిపించుకుంది. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ స్పష్టమైన అంచనాతో పోటీకి దింపిన ఐదో అభ్యర్థి విజయం వెనక ఆ పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించింది.

ఎమ్మెల్యేలకు 3 సార్లు మాక్ పోలింగ్ నిర్వహించి ఓట్లు మురిగిపోకుండా, క్రాస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. సీపీఐ, సీపీఎం ఈ ఎన్నికలకు దూరంగా ఉండటంతో విజేతకు అవసరమైన ఓట్ల సంఖ్య తగ్గిపోవడమూ టీఆర్‌ఎస్‌కు కలసి వచ్చింది. దీనికితోడు ఎంఐఎంకు చెందిన ఏడుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడంతో ఐదుగురు అభ్యర్థులు గెలిచేందుకు అవసరమైన సంఖ్యాబలం చేకూరింది. ఎమ్మెల్యే కోటా నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే టీఆర్‌ఎస్ ఒక ప్రణాళికతో ఉంది.

ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే 4 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకునే వీలున్నా ఐదో అభ్యర్థిని  పోటీకి పెడుతున్నట్లు ప్రకటించింది. మండలి చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల నుంచి వచ్చి తమకు సహకరించిన ముగ్గురికీ టికెట్లు ఇచ్చింది. ఇప్పటికే మంత్రివర్గంలో కొనసాగుతున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులకు టికెట్ ఖరారు చే సింది. ఒక దశలో టీడీపీ కాకుండా ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థిని పోటీకి పెడితే ఐదో అభ్యర్థిని పోటీకి పెట్టరనే ప్రచారాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చింది.

కానీ టీడీపీ అభ్యర్థి పోటికి దిగడంతో టీఆర్‌ఎస్ ఐదో అభ్యర్థిని పోటీకి పెట్టింది. దీనికితోడు టీడీపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆ పార్టీకి చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు ఎన్నికలకు 2 రోజుల ముందు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడం కూడా అధికార పార్టీకి కలసి వచ్చిం ది. సోమవారం జరిగిన పోలింగ్‌లో 118 ఓట్లు పోలవగా విజేతకు 17 (16.86) ఓట్లు అవసరమని తేలింది. ఈ లెక్క ప్రకారమే టీఆర్‌ఎస్ 85 మంది ఎమ్మెల్యేలతో తొలి ప్రాధాన్య ఓటుతోనే ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకుంది.

వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుచుకుంది 63 స్థానాలే. కానీ ఆ తర్వాత టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నుంచి నలుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఆ పార్టీలో చేరారు. బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు విలీనం అయ్యారు. దీంతో బలం 76కు పెరిగింది. దీనికితోడు ఎంఐఎం 7, వైఎస్సార్ కాంగ్రెస్ 1 ఎమ్మెల్యే, నామినెటెడ్ ఎమ్మెల్యే మద్దతుతో 85 ఓట్లను సమకూర్చుకుని ఐదుగురిని గెలిపించుకుంది.
 
సీఎంను కలిసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ విజేతలు

మండలి ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు సోమవారం రాత్రి మంత్రులు నాయిని, ఈటల, మరికొందరు ఎమ్మెల్యేలతో కలసి సీఎం కేసీఆర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా విజేతలకు కేసీఆర్ అభినందనలు తెలపగా తమకు అవకాశం కల్పించి, ఎన్నికల్లో గెలిపించినందుకు నూతన ఎమ్మెల్సీలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement