పరిషత్‌ పోరుకు  రెడీ | Sakshi
Sakshi News home page

పరిషత్‌ పోరుకు  రెడీ

Published Sat, Apr 13 2019 12:00 PM

Telangana MPTC And ZPTC Elections - Sakshi

హన్మకొండ: జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్‌ ఎన్నికలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పూర్వ వరంగల్‌ జిల్లా ప్రజా పరిషత్‌ స్థానంలో కొత్తగా ఆరు జెడ్పీలు ఏర్పాటు కానున్నాయి. ఎన్నికల అనంతరం ఇవి రూపాంతరం చెందనున్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా ప్రజా పరిషత్‌ల వారీగా ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ సజావుగా, చురుకుగా సాగేందుకు ప్రస్తుత వరంగల్‌ జిల్లా ప్రజా పరిషత్‌లోని ఉద్యోగుల మధ్య పని విభజన చేశారు. జిల్లాకు ఒక సూపరింటెండెంట్, సీనియర్‌ అసిస్టెంట్, టైపిస్టు చొప్పున కేటాయించారు. వీరు ఆయా జిల్లా కలెక్టర్, నోడల్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కలెక్టర్లే ఎన్నికల అధికారులుగా ఉన్నారు. వీరు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు, సూచనల మేరకు ప్రక్రియను ముందుకు తీసుకుపోతున్నారు.

ఆరు జిల్లా పరిషత్‌లు..
పూర్వ వరంగల్‌ జిల్లా ప్రజా పరిషత్‌ స్థానంలో కొత్తగా వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లా ప్రజా పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుత వరంగల్‌ జిల్లా ప్రజా పరిషత్‌లో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్‌లు, టైపిస్టులకు కొత్త జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో సూపరింటెండెంట్‌ వెంకటరమణ, సీనియర్‌ అసిస్టెంట్‌ పాషా, టైపిస్టు సూర్యప్రకాష్, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో సూపరింటెండెంట్‌ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ పాషా, టైపిస్టు, జనగామలో సూపరింటెండెంట్‌ రవీందర్, సీనియర్‌ అసిస్టెంట్‌ సోమనర్సయ్య, టైపిస్టు రాజ్‌కుమార్,

జయశంకర్‌ భూపాలపల్లిలో సూపరింటెండెంట్‌ సునిత, సీనియర్‌ అసిస్టెంట్‌ నర్సింగరావు, ములుగులో సూపరింటెండెంట్‌ వెంకటరమణ, సీనియర్‌ అసిస్టెంట్‌ వినీత్, మహబూబాబాద్‌లో సూపరింటెండెంట్‌ ఎగ్బాల్, సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రభాకర్, టైపిస్టు ప్రదీప్‌ ఎన్నికల ఏర్పాట్లను చూస్తున్నారు. వీరు జోనల్, రూట్ల గుర్తింపు, పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూంలు, కౌంటింగ్‌ కేంద్రాల గుర్తింపు వంటి కార్యక్రమాలతోపాటు ఓటరు జాబితా తయారీ ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రకటన వంటి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 18న కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, నోడల్‌ ఆఫీసర్లకు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులోనే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్‌పై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

మండల కేంద్రాల్లోనే జెడ్పీటీసీల నామినేషన్ల స్వీకరణ
జిల్లా ప్రజా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాని(జెడ్పీటీసీ)కి పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను గతంలో జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో స్వీకరించే వారు. ఈసారి మండల కేంద్రాల్లోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కేంద్రంలో జెడ్పీటీసీ నామినేషన్లు స్వీకరిస్తారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఆరు కొత్త జిల్లాల్లో మొత్తం 71 జిల్లా ప్రజా పరిషత్‌ ప్రాదేశిక నియోజక వర్గాలున్నాయి. ఈ స్థానాల నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులు మండల కేంద్రాల్లోనే నామినేషన్‌ వేసేలా సౌకర్యం కల్పిస్తున్నారు.

క్లస్టర్ల వారీగా ఎంపీటీసీలనామినేషన్ల స్వీకరణ  
ఎంపీటీసీల నామినేషన్లు ఈసారి క్లస్టర్ల వారీగా స్వీకరించనున్నారు. గతంలో మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించే వారు. ఈ ప్రక్రియ సులువుగా కొనసాగేందుకు క్లస్టర్లుగా విభజించారు. ప్రతి మూడు ఎంపీటీసీ స్థానాలకు ఒక క్లస్టర్‌ చొప్పున ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్‌కు ఒక రిటర్నింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారిని నియమిస్తారు. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలోనే క్లస్టర్‌ల కేంద్రాలు ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరిస్తారు.

20న తుది ఓటరు జాబితా..
జిల్లా, మండల ప్రజా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితాను ఈనెల 20న విడుదల చేయనున్నారు. ఈనెల 8న డ్రాఫ్ట్‌ జాబితాను ప్రదర్శించారు. ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 17వ తేదీ వరకు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను క్రోడీకరించి ఈనెల 20న తుది జాబితాను విడుదల చేస్తారు.

ప్రత్యేక అధికారుల నియామకం.. 
న్నికల పనులు త్వరితగతిన, సజావుగా జరిగేందుకు ఒక్కో కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఒక్కో జిల్లా స్థాయి అధికారిని నియమించారు. బ్యాలెట్‌ బాక్స్‌ల నిర్వహణ, వాహనాలు సమకూర్చడం, ఎన్నికల నియమావళి అమలు, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణ వంటి కార్యక్రమాలకు వేర్వేరుగా అధికారులను నియమించారు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  

Advertisement
Advertisement