కొత్త మంత్రులు ఏమన్నారంటే.. | Sakshi
Sakshi News home page

కొత్త మంత్రులు ఏమన్నారంటే..

Published Wed, Dec 17 2014 2:43 AM

telangana new ministers views

సాక్షి హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో భాగంగా తెలంగాణ రాష్ర్ట తొలి కేబినెట్‌లో చోటు సాధించడం తమ అదృష్టమని కొత్త మంత్రులు పేర్కొన్నారు. మంగళవారం ప్రమాణస్వీకారం అనంతరం సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ కేబినెట్‌లో స్థానం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలపడంతోపాటు, మంత్రులుగా తెలంగాణ పునర్నిర్మాణం కోసం కృషిచేస్తామని చెప్పారు. కొత్త మంత్రుల అభిప్రాయాలు వారి మాటల్లోనే...

రాష్ట్ర అభివృద్ధికి పోరాడతా: ఇంద్రకరణ్
తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్‌లో స్థానం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. తెలంగాణ కోసం ఎంతో పోరాడా... స్వరాష్ర్టం అభివృద్ధికి మరింత పోరాడతాను. తెలంగాణ అభివృద్ధిలో సహకరించాలనే సీఎం ఆహ్వానం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరా. జిల్లా అభివృద్ధి కోసం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో కలసి పనిచేస్తాను.

శభాష్ అనిపించుకుంటా: తుమ్మల
తెలంగాణ పునర్నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడమే నా ప్రధాన లక్ష్యం. ఎప్పుడో వందల ఏళ్ల క్రితమే తెలంగాణలో చెరువుల నిర్మాణం ద్వారా 260 టీఎంసీల నీటి నిల్వ జరిగింది. ఇప్పుడు  ఆ వ్యవస్థను పునరుద్ధరిస్తాం. రహదారులు, విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించి శభాష్ అనిపించుకుంటా.

నా అదృష్టం: లక్ష్మారెడ్డి
పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ అదే పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తాం. నవ తెలంగాణ నిర్మాణానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. 50 ఏళ్లలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేయలేకపోయిన అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపిస్తాం. ఉద్యమనేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం ఆనందకరం. అలాంటి నేత నేతృత్వంలో పనిచేయడం నా అదృష్టం. పెండింగ్ ప్రాజెక్టులను కూడా వేగంగా పూర్తి చేస్తాం.

Advertisement

తప్పక చదవండి

Advertisement