తెలంగాణ.. అభివృద్ధికి చిరునామా కావాలి | Sakshi
Sakshi News home page

తెలంగాణ.. అభివృద్ధికి చిరునామా కావాలి

Published Tue, May 12 2015 5:00 AM

Telangana should develop in a good manner

నల్లగొండ జిల్లాలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఫార్మసీ చదువు పూర్తి చేసి జీవనభృతి కోసం మస్కట్ వెళ్లాడు. అనుకోని అవకాశం తలుపు తట్టడంతో అమెరికా పయనమయ్యాడు. అది ఆయన జీవితాన్నే మార్చేసింది. ఫార్మసీలో ఉద్యోగి స్థాయి నుంచి సొంతంగా న్యూయార్క్‌లో మూడు ఫార్మసీలను స్థాపించే స్థాయికి ఆయనను చేర్చింది. అమెరికా తెలుగు అసోసియేషన్ ట్రస్టీల్లో ఒకరిగా మార్చింది. తెలంగాణ అసోసియేషన్ ఫర్ ఫార్మా అండ్ కెమికల్ ఇండస్ట్రీస్‌కి ఎన్నారై కన్వీనర్‌ని, అమెరికాలోని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్‌కి ఉపాధ్యక్షుడిని చేసింది. ఇన్ని బాధ్యతలను ఏక కాలంలో సమర్థంగా నిర్వర్తిస్తూ, మరోవైపు తెలంగాణ అభివృద్ధి కోసం ఉత్సాహంగా అడుగులు వేస్తోన్న ఆయనే లక్షణ్ అనుగు. తన జీవిత విశేషాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

అమెరికాలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ స్థాపించాలన్న ఆలోచన ఎవరిది?
ఓసారి ప్రొఫెసర్ జయశంకర్ అమెరికా వచ్చారు. నా రూమ్మేట్స్ అయిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ఆయన్ని కలవాలని అనుకున్నారు. వాళ్లతో పాటే నేనూ వెళ్లాను. అక్కడ ఆయన తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడిన మాటలు విని స్ఫూర్తి పొందాను. ఆయన చేతుల్లో పురుడు పోసుకున్న సంస్థే తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్.

తెలంగాణ ఉద్యమమే లక్ష్యంగా దీన్ని స్థాపించారా?
ఈ ఫోరమ్ స్థాపించేనాటికి అసలు ఉద్యమమే లేదు. తెలంగా ణవాడిగా ఇక్కడి ప్రాంతాలకు మంచి చేయాలన్న లక్ష్యం, అభి వృద్ధిపర్చాలన్న ఆశయంతో దీన్ని స్థాపించాం. ఆదిలాబాద్ జిల్లాలో 200 మంది పిల్లలు కలరా వచ్చి చనిపోయారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. అది నన్ను కలచివేసింది. ఇలాంటి బాధాకర పరిస్థితులు అక్కడ చాలా ఉన్నాయి. వాటిని మార్చాలన్న ఉద్దేశంతోనే ఈ ఫోరమ్ ఊపిరి పోసుకుంది.  

తెలంగాణ ఉద్యమంలో మీ ఫోరమ్ ఎలాంటి పాత్ర పోషించింది?
నిజానికి మా ఫోరమ్ చాలా ప్రముఖ పాత్ర పోషించింది. సమావేశాలు నిర్వహించింది. పుస్తకాలు ప్రచురించింది. మూడు వేల మంది సభ్యులున్నాం. ప్రత్యేక రాష్ట్రం కల  తీరింది కాబట్టి ఇప్పుడు అభివృద్ధి మీద దృష్టి సారిస్తున్నాం.  

ఇంతవరకూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు?
చేనేత కార్మికులకు చేయూతనివ్వడం కోసం సంకల్పం అనే ప్రాజెక్టును ప్రారంభించాం. భారతి అనే ప్రాజెక్ట్ ద్వారా విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నాం. లైబ్రరీలు స్థాపిస్తున్నాం. ‘మిషన్ కాకతీయ’లో భాగస్వాములమయ్యాం. ఇవన్నీ చేయడానికి సభ్యులందరం కలిసి  ప్రతి ఒక్కరం రోజుకో డాలర్ సేవ్ చేయాలని నిర్ణయించుకున్నాం.  

ప్రభుత్వ ప్రోత్సాహం ఎలా ఉంది?
మేము ఏదైనా ప్లాన్ చెబితే కేసీఆర్‌గారు సానుకూలంగా స్పం దిస్తున్నారు. అంతా కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని భరోసా ఇస్తున్నారు. అంతకంటే కావాల్సింది ఏముంది!

భవిష్యత్ ప్రణాళికలు...?
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చడమే. ఇంతవరకూ చెప్పినవాటితో పాటు నాకొక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. నేను మస్కట్‌లో ఉన్నప్పుడు మన భారతీయులు చాలామంది ఆవేశంలో చిన్న చిన్న నేరాలకు పాల్పడి జైలు పాలవడం చూశాను. నిజానికి వాళ్లు నేరస్తులు కాదు. చేసిన చిన్న పొరపాట్లకు పెద్ద శిక్షలకు గురై జైళ్లలో మగ్గిపోతుం టారు. వాళ్లు ఏమైపోయారో, ఎలా ఉన్నారో తెలియక వారి తల్లిదండ్రులు అల్లాడిపోతుంటారు.

కొందరు విదేశాల్లో ప్రమాదాల్లో మరణిస్తుంటారు. వారి వివరాలను ఇంటికి చేరవేయడం, మృతదేహాలను స్వస్థలానికి రప్పించడం చాలా పెద్ద పని. ఈలోపు వారి కుటుంబ సభ్యులు ఎంతో వేదన అనుభవిస్తుంటారు. ఇలాంటి సమస్యలు తీర్చడం కోసం మన ప్రభుత్వం ఏదైనా చేయాలి. దీనికోసం ఓ విభాగాన్ని స్థాపించి, ఒక ఐఏఎస్ అధికారికి దాని బాధ్యత అప్పగించాలి. ఈ విషయమై కేసీఆర్‌గారితో ఇప్పటికే చర్చించాను. ఆయన త్వరలో ఏర్పాటు చేద్దామన్నారు. అది సాకారమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నా.

Advertisement
Advertisement