కేసీఆర్‌కు వంగి సలాం చేయడమేంటి? | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు వంగి సలాం చేయడమేంటి?

Published Thu, Oct 19 2017 4:16 AM

Telangana TDP MLA Revanth Reddy Fires On AP TDP Leaders  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు టీటీడీపీ నేతలను జైళ్లలో పెడుతోంటే.. ఏపీ టీడీపీ నేతలు మాత్రం కేసీఆర్‌కు వంగి వంగి దండాలు పెడుతున్నారని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వారికి కేసీఆర్‌తో లావాదేవీలు ఉన్నాయని ఆరోపించారు. తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో రేవంత్‌ బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ తనతో చర్చలు జరుపుతున్నది వాస్తవమేనని ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా ఏపీ టీడీపీ నేతలపై మండిపడ్డారు. ‘‘ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడి పెళ్లికి వెళ్లినప్పుడు కేసీఆర్‌కు ఏపీ టీడీపీ నేతలు వంగి వంగి దండాలు పెట్టారు. అంతగా సలాములు ఎందుకు కొడుతున్నారు? మరి తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి పెళ్లికి చంద్రబాబు వచ్చినప్పుడు టీఆర్‌ఎస్‌ నాయకులు అలానే చేశారా? ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడితో కేసీఆర్‌కు లావాదేవీలు ఉన్నాయి. కేసీఆర్‌ ఆయనకు రూ.2 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టారు.

ఇలా కాంట్రాక్టు తీసుకున్న యనమల కేసీఆర్‌ మీద ఈగనైనా వాలనిస్తారా? అసలు తెలంగాణలో ఏపీ మంత్రులకు పనేంటి? కేసీఆర్‌కు ఏపీ నేతలు అంతగా మర్యాద చెయ్యాల్సిన అవసరమేంటి? ఏపీ టీడీపీ నేతలు అన్నం పెట్టిన వాళ్లకే సున్నం పెడుతున్నారు. హైదరాబాద్‌లో పరిటాల శ్రీరామ్, పయ్యావుల కేశవ్‌ అల్లుడి భాగస్వామ్యంతో ఉన్న బీర్ల తయారీ కంపెనీకి లైసెన్స్‌ ఎలా వచ్చింది? ఏపీలో పయ్యావుల కేశవ్‌ను ప్రజలు తిరస్కరించారు. ఆయనకు ఉన్నది ఏంటి?..’’అని పేర్కొన్నారు.

చంద్రబాబు మాటలను బట్టి నిర్ణయం
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి తాము కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తున్నామని.. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానాన్ని కలిస్తే తప్పేమిటని రేవంత్‌ ప్రశ్నించారు. ‘‘తెలంగాణలో పార్టీలు లేవు. కేవలం కేసీఆర్, కేసీఆర్‌ వ్యతిరేకులు ఉన్నారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి మేం సిద్ధంగా లేం. అవసరం వచ్చినప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధం. చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత కలుస్తా. టీఆర్‌ఎస్‌లో టీటీడీపీని విలీనం చేస్తారా? లేదా పొత్తు పెట్టుకుంటారా అన్న విషయంపై చంద్రబాబు చెప్పే మాటను బట్టి నిర్ణయం తీసుకుంటా..’’అని పేర్కొన్నారు.

డిసెంబర్‌ 9 నుంచి పాదయాత్ర చేస్తా..
తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా పునరేకీకరణ జరుగుతోందని, అందులో తాను కీలక పాత్ర పోషిస్తానని రేవంత్‌ చెప్పారు. డిసెంబర్‌ 9వ తేదీ నుంచి రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటుందని, తెలంగాణలో పొత్తులేదని కేంద్ర బీజేపీ ఎప్పుడో స్పష్టం చేసిందన్నారు.

ఇక చంద్రబాబు పొత్తులపై ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదని, పొత్తులపై ఆయన స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి పొత్తులపై స్వతహాగా నిర్ణయాలు తీసుకొమ్మని తమకు చంద్రబాబు చెప్పాలన్నారు. పార్టీ మారుతానని తనపై జరుగుతున్న ప్రచారాన్ని చంద్రబాబు నమ్మడం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ ఉనికే లేదని, ప్రధాని మోదీ అందుకే దత్తాత్రేయను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించారని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement