ఫీజు బకాయిలు 500 కోట్లు విడుదల | Sakshi
Sakshi News home page

ఫీజు బకాయిలు 500 కోట్లు విడుదల

Published Sat, Oct 18 2014 2:12 AM

ఫీజు బకాయిలు 500 కోట్లు విడుదల - Sakshi

మొత్తం బకాయిలు రూ. 1587.75 కోట్లు
త్వరలో మిగతావి చెల్లిస్తాం: మంత్రి జగదీశ్‌రెడ్డి


 సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలపై నెలకొన్న సందిగ్ధతను తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. తెలంగాణ పది జిల్లాల్లో ఫీజు బకాయిలన్నింటినీ రెండు,మూడు విడతల్లో చెల్లించాలని నిర్ణయించింది. తొలివిడతగా రూ. 500 కోట్లు మంజూరు చేస్తూ ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేసినట్టు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం  సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్‌కమిటీతో సీఎం చర్చించి  ఈమేరకు నిర్ణయించినట్టు మంత్రి వివరించారు.
 
  2010- 11 విద్యా సంవత్సరం నుంచి 2013-14 వరకు నిలిచిపోయిన రూ. 1587.75 కోట్లను మూడు విడతల్లో పూర్తిగా చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు. ట్యూషన్‌ఫీజుతోపాటు స్కాలర్‌షిప్పు బకాయిలను కూడా పూర్తిస్థాయిలో చెల్లించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ఫీజు బకాయిలన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ముందు(జూన్2కు ముందు) ఉమ్మడి రాష్ట్రంలోనివే అయినప్పటికీ, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని జగదీశ్‌రెడ్డి చెప్పారు.  రాష్ట్రంలోని 10 జిల్లాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు అనే తేడా లేకుండా 18 లక్షల మంది విద్యార్థులకు బకాయిలను చెల్లించనున్నట్టు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చెల్లించిన బకాయిల్లో  58 : 42 నిష్పత్తిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమ వాటాను వసూలు చేసుకుంటామన్నారు. అధికారుల విభజనలో జాప్యం కారణంగానే ఫీజు చెల్లింపుల్లో ఆలస్యం అయిందని, ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసినా ఇప్పటికీ అధికారుల విభజన ప్రక్రియ పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు. ఫీజు బకాయిలు నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని, అప్పటి ప్రభుత్వాలను ప్రశ్నించకుండా కొత్త రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం అంటే బట్టకాల్చి మీదేయడమేనని ఆయన విమర్శించారు. అప్ప టి ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణపై చంద్రబాబు కుట్రలకు ఇక్కడి ప్రబుద్ధులు వంతపాడడం శోచనీయమని టీ-టీడీపీ నాయకులను ఉద్దేశించి మంత్రి విమర్శించారు.
 
 వృత్తి విద్యా కళాశాలల సంఘం హర్షం
 వృత్తి విద్యా కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాల్సిన బకాయిల్లో రూ. 500 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడంపై తెలంగాణ ప్రొఫెషనల్ కాలేజెస్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో  హర్షం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్, విద్యామంత్రి జగదీశ్‌రెడ్డిలకు సంఘం నాయకులు గౌతంరావు, సునీల్ ధన్యవాదాలు తెలిపారు.
 
 సంక్రాంతి నాటికి డీఎస్సీ నోటిఫికేషన్!
 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వచ్చే సంక్రాంతి నాటికి నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు చర్యలు చేపడతామని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు నిరుద్యోగుల సంఘం నేతలు వెల్లడించారు. త్వరగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ పలువురు నిరుద్యోగులు శుక్రవారం సచివాలయంలో మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియను డిసెంబరునాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement