తెలంగాణకు మహిళా సీఎం | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మహిళా సీఎం

Published Sun, May 11 2014 12:20 AM

తెలంగాణకు  మహిళా సీఎం - Sakshi

కాంగ్రెస్‌కు 50 సీట్లు: డీకే అరుణ
 
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని కచ్చితంగా మహిళకే ఇవ్వాలని మాజీ మంత్రి డీకే అరుణ కోరారు. సమాజంలో సగభాగమున్న మహిళలకు సీఎం పదవిస్తే తప్పేముందని ప్రశ్నించారు. తాను మహిళను అయినందున సహజంగానే సీఎం రేసులో ఉంటాననే ప్రచారం జరుగుతోందన్నారు. ఆమె శనివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని కాంగ్రెసే ఏర్పాటు చేస్తుందన్నారు. ‘‘నా అంచనా మేరకు కాంగ్రెస్‌కు 50 స్థానాలొస్తాయి. మరో 15 స్థానాల్లో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉంటుంది.కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉన్నా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినందున ప్రభుత్వ వ్యతిరేకత లేదు. పైగా తెలంగాణ ఇవ్వడంతో ప్రజలంతా కాంగ్రెస్‌నే ఆదరించారు.

ప్రజల్లో గందరగోళం సృష్టించడానికే కేసీఆర్ సహా పలువురు సర్వేల పేరుతో ప్రచారం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 10 సీట్లు కచ్చితంగా కాంగ్రెస్‌వే. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. కాబట్టి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాల్సిన అవసరం మాకు లేదు. అయినా ఇంకా ఫలితాలే రాలేదు. అలాంటప్పుడు ఎలా ప్రలోభ పెడతారు? కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదు’’ అన్నారు. కాంగ్రెస్‌కు మెజారిటీ రాకుంటే మిత్రపక్షాలైన మజ్లిస్, సీపీఐ సహకరిస్తాయి’’ అని చెప్పారు.
 

Advertisement
Advertisement