సీసీఐలో ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

సీసీఐలో ఉద్రిక్తత

Published Tue, Nov 18 2014 12:11 AM

tensions in cement corporation of india

తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్‌కోట్ గ్రామ శివారులో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని ఇళ్లు, ఆహారపదార్థాలు, తాగునీటిపై  సిమెంట్ తో కూడిన దుమ్ము విపరీతంగా పడుతోందని గ్రామ యువకులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టారు. పర్సనల్ మేనేజర్ గుప్తాను అడ్డుకున్నారు. కార్మికులను విధుల్లోకి వెళ్లకుండా అడ్డుతగిలారు. దీంతో కంపెని ప్రతినిధు లు,  యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కరన్‌కోట్ గ్రామానికి చెందిన 50 మంది యువకులు సోమవారం ఉదయం  సీసీఐ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టారు. పర్సనల్ మేనేజర్ గుప్తాను అడ్డుకున్నారు. లిఖిత పూర్వంగా హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించబోమని పట్టుబట్టారు. గుప్తాను తొలుకొని ఫ్యాక్టరీ పక్కనే ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనంలోని తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించాలంటూ   నినాదాలు చేశారు.

 గతంలో ఇచ్చిన హామీ ఏమైంది...!
 గతంలో సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి  విపరీతంగా దుమ్ము వస్తే ఆందోళన చేసిన గ్రామస్తులకు త్వరలో పరిష్కరిస్తానని ఇచ్చిన  హామీ ఏమైందని కంపెని ప్రతినిధులను యువకులు ప్రశ్నించారు.  అనేకసార్లు వినతిపత్రం ఇచ్చినా ఎందు కు స్పందించ లేరని నిలదీశారు.  స్థానిక యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. దుమ్ము వదిలితే కంపెనీకి తాళం వేస్తామని హెచ్చరించారు.

 రెండు నెలల్లో పరిష్కరిస్తా: జీఎం
 ఉన్నతాధికారులతో మాట్లాడి రెండు నెల ల్లో దుమ్మును నివారించేందుకు కృషి చేస్తానని కంపెనీ  జీఎం వీకే పాండ్యా యువకులకువివరించారు. గ్రామ యువకులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై కూడా ఉన్నతాధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని యువకులు డిమాండ్ చేయడంతో కంపెనీ ప్రతినిధులు, యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న కరన్‌కోట పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ ప్రకాష్‌గౌడ్ యువకులతో మాట్లాడి సర్దిచెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement