వెబ్సైట్ లో టెన్త్ హాల్ టికెట్లు | Sakshi
Sakshi News home page

వెబ్సైట్ లో టెన్త్ హాల్ టికెట్లు

Published Thu, Mar 10 2016 2:39 AM

వెబ్సైట్ లో టెన్త్ హాల్ టికెట్లు

నేటి రాత్రి 8 గంటల నుంచి విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో టెన్త్ విద్యార్థుల హాల్ టికెట్లను విద్యా శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి విద్యార్థులు వెబ్‌సైట్(bsetelangana.org) నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టింది. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ చేయిం చుకుని పరీక్షకు హాజరు కావచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల మొదట్లోనే పాఠశాలలకు హాల్ టికెట్లను పంపించామని, విద్యార్థులంతా స్కూళ్ల నుంచి హాల్‌టికెట్లను తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యాజమాన్యాలు హాల్‌టికెట్లను నిరాకరించడానికి వీల్లేదన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు, ఇతరత్రా కారణాలతో హాల్‌టికెట్లను నిరాకరించినట్లు ఫిర్యాదులు వస్తే ఆయా పాఠశాలలపై కఠిన చర్యలు చేపట్టాలని పరీక్షల విభాగం నిర్ణయించింది. టెన్త్ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు అన్ని చర్యలను విద్యా శాఖ పూర్తి చేసింది. బుధవారం పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్, ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి జిల్లా స్థాయి అబ్జర్వర్లతో పరీక్షల నిర్వహణపై చర్చించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

 అరగంట ముందే అనుమతి..
టెన్త్ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్నప్పటికీ విద్యార్థులు ఉదయం 8:30 గంటల కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు వెల్లడించారు. 8:45 గంటల నుంచి 9 గంటల వరకు పరీక్ష హాల్లోకి అనుమతి ఇస్తారు. 9 గంటలకు విద్యార్థులకు ఓఎంఆర్ పత్రాలు అందజేస్తారు. అందులో విద్యార్థుల వివరాలను రాయాల్సి ఉంటుంది. పరీక్ష ప్రారంభమయ్యాక 15 నిమిషాల వరకే విద్యార్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అదీ మొదటి రోజు మాత్రమేన ని, మిగితా రోజుల్లో ముందుగానే రావాలన్నారు. అరగంట ముందుగానే ఓఎంఆర్ జవాబు పత్రం ఇస్తున్నందునా ఆలస్యంగా వస్తే విద్యార్థులకే సమయం వృథా అవుతుందన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తొలుత భావించినా ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించాల్సి రావడంతో ఆ ఆలోచనను విద్యా శాఖ విరమించుకుంది. అయితే 10 నుంచి 20 వరకు సమస్యాత్మక కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తోంది.

 2,615 కేంద్రాల్లో పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 2,615 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు పరీక్షల విభాగం ఏర్పాట్లు చేసింది. ఇందులో ప్రభుత్వ స్కూళ్లలో 2,427 కేంద్రాలు, ప్రైవేటు స్కూళ్లలో 188 కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతేడాది 5.65 లక్షల మంది పరీక్షలు రాయగా.. ఈసారి 11,181 పాఠశాలల నుంచి 5,56,757 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 5,21,046 మంది ఉండగా.. ప్రైవేటు విద్యార్థులు 35,711 మంది ఉన్నారు. రెగ్యులర్‌లో బాలురు 2,68,938, బాలికలు 2,58,108 మంది ఉన్నారు. మరో 11,500 మంది ఓల్డ్ సిలబస్ విద్యార్థులు ఓపెన్ స్కూల్ పరీక్షలకు వెళ్లనున్నారు.

Advertisement
Advertisement