మూగబోయిన మగ్గం.. | Sakshi
Sakshi News home page

మూగబోయిన మగ్గం..

Published Mon, Mar 23 2015 4:04 AM

మూగబోయిన మగ్గం..

* సిరిసిల్లలో నేటి నుంచి సాంచాలు బంద్
* నష్టాల కారణంగా వస్త్రం ఉత్పత్తి నిలిపివేత
* అమ్ముడుపోని వస్త్రం.. పేరుకుపోతున్న నిల్వలు
* ధర పెట్టని దళారులు..  మీటర్‌కు 70 పైసలు నష్టం
* ఆందోళనలో కార్మికులు.. వారం తర్వాత ప్రారంభిస్తామన్న యాజమాన్యాలు
* సిరిసిల్లలో రోజూ ఉత్పత్తయ్యే పాలిస్టర్ వస్త్రం 27 లక్షల మీటర్లు
* దీనిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు 15 వేల మంది
* రోజుకు సగటున వస్తున్న నష్టం రూ.1.35 కోట్లు

 
 సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మళ్లీ సంక్షోభంలో పడింది. దళారులు ధర తగ్గించేశారు.. కొనుగోళ్లూ మానేశారు.. ఉత్పత్తయిన వస్త్రం గుట్టలుగా పేరుకుపోతోంది.. ఈ నష్టాలు భరించలేక ఉత్పత్తిదారులు సాంచాలను నిలిపివేయాలని నిర్ణయించారు.. దీనిపైనే ఆధారపడిన కార్మికులంతా ఉపాధి కోల్పోనున్నారు.     
 - సిరిసిల్ల
 
 వస్త్రాలు కొనని వ్యాపారులు
 సిరిసిల్లలో ఉత్పత్తయిన వస్త్రాన్ని కొనేందుకు నెల రోజులుగా హైదరాబాద్ వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దేశంలోనే అత్యధికంగా సిరిసిల్లలో మొత్తం 34 వేల మరమగ్గాలు ఉండగా.. 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తవుతోంది. ఒక్కో మగ్గంపై రోజూ దాదాపు వంద మీటర్ల వస్త్రం ఉత్పత్తవుతుంది. హైదరాబాద్ వ్యాపారులు దీనిని మీటరుకు రూ. 5.80 చొప్పున కొనుగోలు చేసేవారు. కానీ ఇటీవల ఆ వస్త్రం అమ్ముడుపోవడం లేదంటూ మీటర్‌కు రూ. 5.10 చొప్పున మాత్రమే చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఫలితంగా ప్రతి మీటర్‌పై 70 పైసల నష్టాన్ని వస్త్రోత్పత్తిదారులు భరించాల్సి వస్తోంది. ఇలా నష్టానికి అమ్ముకోలేక వస్త్రాన్ని అమ్మకుండా ఉంచడంతో నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. దీంతో ఈ నిల్వలు తగ్గేవరకూ అసలు వస్త్రం ఉత్పత్తి చేయొద్దని సిరిసిల్ల పాలిస్టర్ వస్త్రోత్పత్తిదారుల సంఘం నిర్ణయించింది. వారం రోజులపాటు సాంచాలు బంద్ పెట్టాలని వారు భావిస్తున్నారు.
 
  అంతా ఏజెంట్ల ఇష్టమే..
 సిరిసిల్లలో తయారైన వస్త్రాన్ని హైదరాబాద్‌కు చెందిన 13 మంది కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేస్తారు. మార్కెట్ అవసరాలను బట్టి ధర నిర్ణరుుంచి వస్త్రం టాకాలను దిగుమతి చేసుకుంటారు. ప్రస్తుతం ఏజెంట్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు తక్కువ ధరకే పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
 
   వారం పాటు నిలిపివేత!
 సిరిసిల్లలోని పాలిస్టర్ మరమగ్గాలను సోమవారం నుంచి బంద్ చేయాలని వస్త్రోత్పత్తిదారులు నిర్ణయించారు. వారం పాటు ఉత్పత్తి నిలిపివేయాలని భావిస్తున్నారు. సాంచాల బంద్‌తో ఆసాములు, కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. అనివార్య పరిస్థితుల్లోనే సాంచాలు బంద్ పెడుతున్నామని యజ మానులు పేర్కొంటుండగా... ఈ నిర్ణయూన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నారుు.
 
 గత్యంతరం లేకే బంద్..
 నెల రోజులుగా నష్టాలకే వస్త్రాన్ని అమ్ముకుంటున్నాం. నష్టాన్ని భరించడం కష్టంగా ఉంది. తక్కువ ధరకు వస్త్రాన్ని అమ్మడం ఇబ్బందిగా ఉండడంతో గత్యంతరం లేకే సాంచాలు బంద్ పెట్టాలని నిర్ణయించాం. వారం రోజులుగా ఆగితే మార్పు వస్తుందని భావిస్తున్నాం. ఆసాములు, కార్మికులు సహకరించాలి.     
 - దూడం శంకర్, వస్త్రోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు
 
 ఎప్పుడూ ఇదే బాధ..
 ఏటా అన్‌సీజన్‌లో వస్త్రం ధర తగ్గడం సాధారణమే అరుునా... ఈసారి మార్చిలోనే పరిస్థితి దిగజారడం వస్త్రోత్పత్తిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కూలి రేట్లు పెరగడంతో ఒక్కో కార్మికుడికి రోజుకు రూ. 30 నుంచి రూ. 40 వరకు అదనంగా ఇస్తున్నారు. ఈ మేరకు వస్త్రానికి ధర పెరగకపోగా.. ధర ఇంకా తగ్గడంతో యజమానులు నష్టాల్లో మునిగిపోతున్నారు. పేరుకుపోయిన నిల్వలను అమ్ముకుని కొత్తగా ఉత్పత్తయ్యే వస్త్రాన్ని వారం తర్వాత డిమాండ్ ధరకు అమ్ముకోవాలని యోచిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వపరంగా వస్త్ర వ్యాపారంపై అజమారుుషీ లేకపోవడంతో ఈ పరిశ్రమ ఆటుపోట్ల మధ్య కొనసాగుతోంది. ఇటీవల కార్మికులకు పెంచిన కూలి మూలంగా నష్టాలు వస్తున్నాయన్న నెపంతో యజమానులు బంద్ పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
 
 ఖాళీగా ఉండుడే..
 ఐదేళ్లుగా పాలిస్టర్ సాంచాలు నడుపుతున్నాం. సాంచాలు బంద్ పడితే ఖాళీగా ఉండుడే. నేను ఎనిమిది సాంచాలు నడుపుతాను. రోజుకు 12 గంటలు పనిచేస్తే నెలకు రూ. ఆరు వేల దాకా వస్తాయి.
     - పోరండ్ల రాజ్‌కుమార్,  పవర్‌లూం కార్మికుడు
 
 మరో పని రాదు
 సిరిసిల్లలో పదిహేనేళ్లుగా సాంచాలు నడుపుతున్న. నా భార్య బీడీలు చేస్తుంది. సాంచాలు బంద్ పడితే ఇల్లు నడపడం కష్టమే. పెంచిన కూలిని మొన్నట్నుంచే ఇస్తుండ్రు. రోజుకు రూ. 40 పెరిగినయి. మరో పనిరాదు ఏంజెస్తం..     
 - దొంతు హన్మంతు, కార్మికుడు

Advertisement

తప్పక చదవండి

Advertisement