ఎన్నికల గమ్మత్తు | Sakshi
Sakshi News home page

ఎన్నికల గమ్మత్తు

Published Tue, May 6 2014 3:36 AM

ఎన్నికల గమ్మత్తు

  •      లిక్కర్ కిక్ రూ.483 కోట్లు
  •      ఏప్రిల్‌లో పోటెత్తిన ‘గ్రేటర్’ మద్యం అమ్మకాలు
  •      సిటీ కంటే శివారులోనే అత్యధికం
  •  సాక్షి, సిటీబ్యూరో :  సార్వత్రిక పోరులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మద్యం ఏరులై ప్రవహించింది. ప్రధాన నగరం కంటే శివార్లలోని పది నియోజకవర్గాల్లో లిక్కర్ కిక్కు అధికమని ఆబ్కారీ శాఖ లెక్కగట్టింది. ఉభయ జిల్లాల పరిధిలో ఏప్రిల్ నెలలో మొత్తంగా రూ.483 కోట్ల మద్యాన్ని మందుబాబులు గుటకాయ స్వాహా చేసినట్లు తేలింది.

    ఈసీ డేగకన్నుతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జాగ్రత్తపడి స్టాకు ‘ఫులు’్ల చేయడంతోనే మద్యం అమ్మకాల జోరు పెరిగిందని తేల్చారు. స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు వరుసగా వచ్చిన నేపథ్యంలో.. మద్యం అమ్మకాల జోష్ పెరిగి ఈసారి తాము విక్రయించే కోటా ముగియడంతో పలువురు మద్యం వ్యాపారులు కొత్తరూటును ఎంచుకున్నారు. తమపై పడే ప్రివిలేజ్ ఫీజును సైతం ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల నుంచి వసూలు చేసి మరీ మద్యం కొనుగోలు చేసి సరఫరా చేసినట్లు సమాచారం.
     
    శివార్లలో సూపర్ కిక్కు
     
    ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 538 మద్యం దుకాణాలు, 475 బార్లలో ఏప్రిల్ 30 నాటికి రూ.483 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఆబ్కారీ శాఖ లెక్కగట్టింది. హైదరాబాద్, సికింద్రాబాద్, ధూల్‌పేట్ ఎక్సైజ్ డివిజన్ల పరిధిలో కంటే శివార్లలోని మేడ్చల్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్ డివిజన్ల పరిధిలో మద్యం అమ్మకాల జోరు పెరిగినట్లు తేలింది.

    శివార్లలోని మహేశ్వరం, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో మద్యం ఏరులై పారినట్లు తెలిసింది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఏప్రిల్‌లో రూ.300 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రధాన నగరం (కోర్‌సిటీ)లో కేవలం రూ.183 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలిపాయి. ఎన్నికల సంఘం నిఘా పటిష్టం చేయడంతోనే మద్యం పంపకాలు, నిల్వ చేయడం వంటి ఆగడాలు కోర్‌సిటీలో తగ్గాయని విశ్లేషించాయి.

Advertisement
Advertisement