టీఆర్‌ఎస్‌ పతనం ఆరంభం | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ పతనం ఆరంభం

Published Mon, Jul 10 2017 2:33 AM

టీఆర్‌ఎస్‌ పతనం ఆరంభం - Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజం
 
గరిడేపల్లి: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పతనం ఆరంభమైందని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గరిడేపల్లి ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందని చెప్పారు. కమీషన్లకు కక్కుర్తిపడి మిషన్‌ భగీరథ, కాకతీయ పథకాలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఖరీఫ్‌ నుంచి ఎకరానికి నాలుగు వేల రూపాయలు అందిస్తామని చెబుతున్న కేసీఆర్‌కు ఇన్నాళ్లుగా రైతులపై ఈ ప్రేమ ఎటుపోయిందని ప్రశ్నించారు.

రాష్ట్రంలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదన్నారు. ఏఐసీసీ అధినేత సోనియా దయతో ఏర్పడిన తెలంగాణను తన కుటుంబ స్వార్థం కోసం వాడుకుంటున్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. 2019లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ , సమభావన సంఘాలకు ఎన్ని లక్షలకైనా వడ్డీ లేని రుణాలు, నిరుద్యోగులకు నెలకు రూ. 3వేల నిరుద్యోగ భృతి, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వెంటనే చేస్తామని హామీ ఇచ్చారు. సాగర్‌ ఎడమ కాల్వను ఎండబెట్టిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. రూ. 500 కోట్లతో హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించుకున్న కేసీఆర్‌.. పేదలకు ఇందిరమ్మ బిల్లులు కూడా చెల్లించలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నాడన్నారు. 

Advertisement
Advertisement