రూ.250 కోట్ల భారం | Sakshi
Sakshi News home page

రూ.250 కోట్ల భారం

Published Tue, Feb 10 2015 2:43 AM

రూ.250 కోట్ల భారం

ఇందిరమ్మ బిల్లుల చెల్లింపునకు బ్రేక్
అర్ధాంతరంగా 39,336 ఇళ్లు
పూర్తి కావాలంటే రూ.250 కోట్లు అవసరం
అప్పులు, ఆర్థిక ఇబ్బందుల్లో లబ్దిదారులు
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

 
ముకరంపుర: రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపు నిలిపివేయడంతో లబ్దిదారుల కష్టాలు రెట్టింపయ్యాయి. సొంతింటిపై ఆశతో ఆస్తులు అమ్మి, అప్పుల చేసి ఇళ్లు నిర్మించుకున్న పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మొదటి నుంచి ఆర్థిక ఇబ్బందులు, బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా జిల్లాలో మంజూరైన 39,336 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయాయి. వీటికోసం గతంలో మంజూరు చేసిన రూ.15 కోట్ల నిధులు లబ్దిదారులకు చెల్లించకుండా పెండింగ్‌లోనే ఉంచారు. ప్రస్తుతం ఆయా ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తి కావాలంటే రూ.450 కోట్లు అవుతుందని అధికారుల అంచనా. ఈ నిధులను మంజూరు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేనట్లు కన్పిస్తుండడంతో ఆ భారమంతా లబ్దిదారులపైనే పడే అవకాశముంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, ఇతర వర్గాలకు రూ.75వేలుగా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. జిల్లాలో 2006 నుంచి 2014 వరకు వివిధ దశల్లో 3,16,538 ఇళ్లు మంజూరయ్యాయి.

అందులో 1,78,491 ఇళ్లు పూర్తికాగా, మరో 39,336 ఇళ్లు నిర్మాణ దశలో వున్నాయి. ఇప్పటి వరకు 98,711 ఇళ్లు ప్రారంభానికే నోచుకోలేదు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభానికి నోచుకోని 98,711 ఇళ్లను రద్దు చేసింది. కానీ నిర్మాణ దశలో ఉన్న 39,336 ఇళ్లను పూర్తి చేసే అంశంలో మాత్రం స్పష్టత కొరవడింది. ఇప్పటికే కొన్ని ఇళ్లకు ఒక బిల్లు, ఇంకొన్ని ఇళ్లకు రెండు బిల్లులు, మరికొన్ని ఇళ్లకు మూడు బిల్లులు వచ్చి ఆగిపోయాయి. ఇంకొంత మంది లబ్దిదారులు ఇళ్లు నిర్మించుకున్నా ఒక్క బిల్లు కూడా రాలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు మంజూరు చేయాలని లబ్దిదారులు గత కొన్ని నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు సిమెంట్, స్టీల్, కూలీ ధరల పెంపు కారణంగా ఇళ్ల నిర్మాణాలు లబ్దిదారులకు తలకు మించిన భారమయ్యాయి.

అవినీతిపై నివేదికలేవి?

ఇందిరమ్మ ఇళ్లలో భారీగా అవినీతి జరిగిందని తెలంగాణ ప్రభుత్వం సీఐడీతో విచారణ నిర్వహించింది. విచారణ పూర్తయినప్పటికీ నివేదికలు బహిర్గతం కాలేదు. మరోవైపు పేదలకు 125 గజాల స్థలంలో రూ.4లక్షలతో డబుల్ బెడ్‌రూంతో కూడిన ఇంటిని నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు చెల్లింపు విషయమై వెనుకడగు వేస్తోంది. అయితే సీఐడీ విచారణ పూర్తయినప్పటికీ అటు బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, ఇటు తమకు బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తుండడం పట్ల లబ్దిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఇళ్లు లేని నిరుపేదలు డబుల్‌బెడ్‌రూం కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇప్పటికే గ్రామ సందర్శన, మన ఊరు ప్రణాళికలతో పాటు ప్రజావాణితో కలిపి జిల్లాలో లక్షకు పైగా దరఖాస్తులు సమర్పించారు. ఈ విషయమై హౌసింగ్ పీడీ నర్సింగరావు మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ బిల్లులు ఆగిన మాట వాస్తవమేనని అన్నారు. ప్రభుత్వం నిధులిస్తే లబ్దిదారులకు బిల్లులు చెల్లిస్తామని పేర్కొన్నారు.
 
 మాకు వెలిచాల, మల్కాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. పుస్తెలమ్మి, అప్పులు తెచ్చి ఇండ్ల నిర్మాణాలు మొదలు పెట్టినం. బిల్లులు సక్కర రాక, సొంతంగా కడుదామంటే పైసల్లేక మధ్యలోనే ఆపేసినం. సొంతిండ్లు లేక కరీంనగర్‌లో వేల రూపాయలు పెట్టి కిరాయి ఇండ్లళ్ల ఉంటున్నం. కూలీనాలి చేసుకునేటోళ్లం.. కిరాయిలు కట్టలేకపోతున్నం. మేం కట్టుకున్న ఇండ్ల దగ్గర తాగటానికి నీళ్లు లేవు. కరెంటు లేదు. అవన్నా ఇస్తే అక్కడనే ఉండడానికి సిద్ధంగా ఉన్నం. బిల్లుల కోసం ఆఫీసుల చుట్టు తిరుగవట్టి ఐదేండ్లయితుంది. మాకు మిగిలిన బిల్లులు మంజూరు చేస్తే ఇండ్లు పూర్తి చేసుకుంటం. డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామంటున్న సర్కారు మధ్యలో ఆగమైన మా బతుకుల గురించి పట్టించుకోవాలె.      - ఇదీ ఇందిరమ్మ లబ్దిదారుల గోడు...
 గ్రీవెన్స్‌సెల్‌లో  పలువురు మహిళలు కలెక్టర్‌కు విన్నవించుకున్న తీరు.
 

Advertisement
Advertisement