టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష ఉపనేతగా వినోద్ | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష ఉపనేతగా వినోద్

Published Wed, Jun 4 2014 3:02 AM

టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష ఉపనేతగా వినోద్

కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష ఉపనేతగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బోయినిపల్లి వినోద్‌కుమార్ ఎంపికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ ఎంపీల సమావేశంలో పార్లమెంటరీ పదవులను కేసీఆర్ భర్తీ చేశారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీపార్టీ నేతగా కె.కేశవరావు, లోక్‌సభాపక్షనేతగా మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఎంపికయ్యారు. లోక్‌సభ నేతగా వినోద్‌కుమార్‌ను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా, సామాజిక సమీకరణలు అడ్డు పడినట్లు సమాచారం. ఇప్పటికే వెలమ సామాజికవర్గం నుంచి కేసీఆర్ సీఎంగా, హరీశ్‌రావు, కేటీఆర్‌లు మంత్రులుగా ఉన్నారు.
 
 అదే సామాజికవర్గానికి చెందిన వినోద్‌కుమార్‌కు కులం అడ్డుగా నిలిచినట్లు సమాచారం. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌కు పెద్దదిక్కుగా ఉన్న వినోద్‌కుమార్ సేవలను ఎలాగైనా వినియోగించుకోవాలనే నిర్ణయంతోనే కేసీఆర్ ఆయనకు ఉపనేత పదవి కట్టబెట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు జిల్లాకు కేంద్ర మంత్రి పదవులు లభించినప్పటికీ, లోకసభ ఉపనాయకుడి పదవి దక్కడం ఇదే మొదటిసారి. వరంగల్ జిల్లాకు చెందిన వినోద్‌కుమార్ కరీంనగర్‌లోనే జన్మించారు. హన్మకొండ పార్లమెంట్ సభ్యుడిగా తొలిసారి గెలిచిన ఆయన 2009లో కేసీఆర్ ఖాళీ చేయడంతో కరీంనగర్ లోకసభ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. మరోసారి ఇటీవలి ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ నుంచి పోటీచేసి ఘన విజయం సాధించారు.
 

Advertisement
Advertisement