Sakshi News home page

భూముల అభివృద్ధికి రూ. 50 వేలు

Published Sat, Jun 11 2016 2:28 AM

భూముల అభివృద్ధికి రూ. 50 వేలు - Sakshi

దళిత బస్తీ భూములకు అందజేత
మూడు ఎకరాల్లో సాగు చేస్తున్న పంటలపై ఆరా పూర్తి
సబ్సిడీపై కూరగాయల విత్తనాలు
కలెక్టర్ జగన్మోహన్

 
 
ఆదిలాబాద్ అర్బన్ : నిరుపేద కుటుంబాల మహిళలకు దళిత బస్తీ పథకం ద్వారా అందజేసిన భూముల అభివృద్ధికి ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం ద్వారా రూ. 50 వేలు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. పథకం అమలు, ఇప్పటి వరకు కొన్న భూములు, గతేడాది పంపిణీ చేసిన భూముల్లో సాగు వివరాలు, సాగుకోసం లబ్ధిదారులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఆరా తీశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో దళిత బస్తీ, మిషన్ కాకతీయ పథకాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులను సమష్టి వ్యవసాయం వైపు మళ్లించాలన్నారు. భూముల అభివృద్దికి ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఇచ్చేందుకు నిధులు ఉన్నాయని తెలిపారు.

మూడెకరాల్లో కందులు, కూరగాయలు, సోయా పంటలు వేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మూడెకరాల భూమి లబ్ధిదారులకు ఒక ఫౌల్ట్రీ యూనిట్, సేంద్రియ ఎరువు యూనిట్, డైరీ యూనిట్, ఎడ్లబండ్లు కొనిస్తామన్నారు. లబ్ధిదారులకు పంట రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించాలని అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు.


ఈ నెలాఖరులోగా పట్టాలు ఇవ్వాలి : జేసీ
దళిత బస్తీ పథకం కింద 2014-15, 2015-16లో కొనుగోలు చేసిన భూములకు పట్టాలు, టైటిల్ డీడ్‌లు అందించాలని, ఇప్పటి వరకు లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వని వారు ఈ నెల 30లో వారికి అందించేలా చర్యలు తీసుకోవాలని జేసీ సుందర్ అబ్నార్ తహసీల్దార్లను, ఆర్డీవోలను ఆదేశించారు. సబ్ డివిజన్ రికార్డ్స్ పూర్తి చేయాలని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, వివరాలను వెబ్‌ల్యాండ్‌లో ఉంచేలా చూడాలన్నారు.


 మిషన్ కాకతీయపై...
 మిషన్ కాకతీయపై కలెక్టర్ సమీక్షిస్తూ మొదటి విడతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 558 చెరువు పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 500 చెరువు పనులు పూర్తయ్యాయని, తహసీల్దార్లు ఈ పది రోజుల్లో దృష్టి సారిస్తే మిగతా 58 చెరువుల పూడీకతీత పనులు పూర్తవుతాయని కలెక్టర్  వివరించారు. పని చేయని కాంట్రాక్టర్ల వివరాలు తెలిపితే బ్లాక్‌లిస్టులో పెడతామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అధ్వైత్ కుమార్ సింగ్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ జేమ్స్ కల్వల, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, ఐలయ్య, శివలింగయ్య, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


శాంతి కమిటీ సమావేశం
రంజాన్ పండుగను శాంతియుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ ముస్లిం నాయకులు, మత పెద్దలు, పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రంజాన్ పండుగ సందర్భంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. శాంతియుతంగా, విజయవంతంగా జరిపేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కమిటీ సభ్యులను కోరారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ పట్టణంతో పాటు మావల పంచాయతీ వరకు నీటి సౌకర్యం కల్పించాలని, పట్టణంలో విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని వాటిని సరి చేయాలని కోరారు.

సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీష,  మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, సీపీవో కేశవరావు, వక్ఫ్ అధికారి ఇబ్రహీమ్, సభ్యులు సిరాజ్‌ఖాద్రి, సాజిద్‌ఖాన్, యూనిస్ అక్భానీ, శాంతి కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement