కొనాలె.. ఇవ్వాలె! | Sakshi
Sakshi News home page

కొనాలె.. ఇవ్వాలె!

Published Wed, Aug 13 2014 2:46 AM

కొనాలె.. ఇవ్వాలె!

పంద్రాగస్టున దళితులకు భూ పంపిణీ
ఇంకా... రెండు రోజులే గడువు
ఏర్పాట్ల దశలోనే అధికారులు
భూ లభ్యతపై కొనసాగుతున్న పరిశీలన
జిల్లాలో 113 ఎకరాల ప్రభుత్వ భూమి
ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోనే... తేల్చేసిన అధికార యంత్రాంగం

 
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన మేరకు జిల్లాలో భూమి లేని నిరుపేద దళిత మహిళలకు మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమానికి ఇంకా రెండు రోజులే గడువు ఉంది. అరుునా... జిల్లాలో ఎంత మందికి, ఎంత విస్తీర్ణంలో భూములు పంపిణీ చేసే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. భూ పంపిణీ కార్యక్రమం జిల్లాలో ఎక్కడ ప్రారంభించాలనే అంశంపైనా తుది నిర్ణయం తీసుకోలేదు. ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యతో సంప్రదించిన తర్వాత అధికారులు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అరుుతే.. దళితులకు భూ పంపిణీ చేసేందుకు జిల్లాలో ప్రభుత్వ భూములు లేని పరిస్థితి ఉంది. సాగుకు యోగ్యమైన ప్రభుత్వ భూములు జిల్లాలో 113 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రికార్డుల ప్రకారం ఈ భూములు ప్రభుత్వానికి చెందినట్లుగా ఉన్నా... ప్రస్తుతం ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. దీంతో భూ పంపిణీ కోసం ప్రైవేట్ భూములను కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15న ప్రతి నియోజకవర్గంలో కాకుండా ఒకే నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం భూములను కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు.

మొదటి విడతలో 500 ఎకరాలు

జిల్లాలో మొదటి విడతలో 500 ఎకరాల భూ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  కలెక్టర్ జి.కిషన్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు మండలాల వారీగా ప్రభుత్వ భూములను గుర్తించారు. అదేవిధంగా... ప్రయోగాత్మకంగా ప్రతి గ్రామంలో సగటున 18 మంది భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలను ఇప్పటికే గుర్తించారు. భూ పంపిణీపై ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే జిల్లా యంత్రాంగం నివేదికను రూపొందించింది. వ్యవసాయశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) సమష్టిగా భూ అభివృద్ధి, నీటి వనరుల సదుపాయూల కల్పన  బాధ్యతలు చేపట్టనుంది.

రెండు రోజులే...

జిల్లాలో భూమిలేని నిరుపేద దళిత మహిళలకు ప్రభుత్వం అందచేసే భూముల్లో మొదటి పంటకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి.. ఆ గ్రామంలో నిరుపేద దళిత కుటుంబానికి 3 ఎకరాల చొప్పున భూపంపిణీ చేయాలని సంకల్పించింది. ఈ మేరకు జిల్లాలో  కలెక్టర్ అధ్యక్షతన ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జరిగాయి. ఆర్డీఓలు, ఐకేపీ-డీఆర్‌డీఏ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు నెల రోజులుగా ఇదే పనిలో నిమగ్నయయ్యారు. భూ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడానికి ఇంకా రెండు రోజులమాత్రమే ఉంది. కానీ.. ఇప్పటివరకు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామం ఎంపిక చేయాలన్న దానిపై జిల్లా యంత్రాంగంలో స్పష్టత రాలేదు.

ఒకట్రెండు రోజుల్లో తేలేది కాదు..

ముందుగా అధికారులు ప్రభుత్వ భూమి లభ్యత, అమ్మకానికి ఉన్న ప్రైవేట్ భూముల వివరాలు పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలు సేకరించి కొన్ని గ్రామాలు ఎంపిక చేశారు. అవసరమైన మేరకు ప్రభుత్వ భూమి లేదని, అందుబాటులోకి వచ్చే భూమి సాగు యోగ్యం కాదని తేలడంతో పూర్తిగా ప్రైవేట్ భూమి కొనాలని నిర్ణయించారు. రైతుల నుంచి ప్రభుత్వ భూములు కొనుగోలు చేయడం ఒకటి, రెండు రోజుల్లో తేలే వ్యవహారం కాదు. అధికారులు చెల్లిస్తామని చెబుతున్న ధరకు గ్రామాల్లో మార్కెట్ ధరకు వ్యత్యాసం ఉంటోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎకరానికి రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు చెల్లించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ధరలకు భూములు అమ్మేందుకు రైతులు ముందుకు రావడంలేదు. కొన్నిచోట్ల ధర విషయంలో పెద్దగా సమస్య లేకున్నా... భూమి కొన్న తరువాత సాగునీటి కోసం బోర్లు వేయిస్తే నీళ్లు వస్తాయా... లేదా.. అనే విషయంలో అనుమానాలు ఉంటున్నాయి. పంట ఉత్పత్తి విషయంపై భూసార పరీక్షలు చేయిస్తే నేలసారం ఎలా ఉన్నది తెలుస్తుంది. ఇవన్నీ ఆర్డీఓలు పరిశీలించి భూములు సాగుయోగ్యమైనవని, నీటివనరులు అందుబాటులో ఉన్నాయని... లేదా... అందుబాటులోకి తేవచ్చని తేల్చాక ధర ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయాక అధికారులు భావించిన మేరకు ధరలు ఉండే పరిస్థితి కనిపించడంలేదు. ఈ అంశాలపై మంగళవారం కలెక్టర్ జి.కిషన్ సంబందిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
 
 

Advertisement
Advertisement