అమరుల కుటుంబానికో ఉద్యోగం | Sakshi
Sakshi News home page

అమరుల కుటుంబానికో ఉద్యోగం

Published Sat, May 21 2016 3:40 AM

అమరుల కుటుంబానికో ఉద్యోగం - Sakshi

♦ జూన్ 2న నియామక పత్రాల పంపిణీ
♦ 23న జిల్లా కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్
♦ కొత్త జిల్లాలు, అవతరణ వేడుకల ఎజెండా
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమర వీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వచ్చే నెల 2న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఉద్యోగ నియామక పత్రాలు అందించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కొందరికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారు. ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబ సభ్యులు సూచించిన వ్యక్తికి ఉద్యోగ అవకాశం ఇవ్వాలని, కనీస విద్యార్హతలు లేకున్నా ఉద్యోగమిచ్చి, అర్హతలు సాధించడానికి అయిదేళ్ల సమయం ఇవ్వాలని సీఎం సూచించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహణ, ఈ సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి సీఎం కేసీఆర్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్ అధికారులు రేమండ్ పీటర్, బీఆర్ మీనా, శివశంకర్, వెంకటేశ్వర్లు, శాంతకుమారి, వరంగల్ కలెక్టర్ కరుణ, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 జిల్లాకో మంత్రికి బాధ్యతలు...
 జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున పతాకావిష్కరణ, అవార్డుల ప్రదానం, తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. వరంగల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మెదక్‌లో హరీశ్‌రావు, ఆదిలాబాద్‌లో జోగు రామన్న, నిజామాబాద్‌లో పోచారం శ్రీనివాసరెడ్డి, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, రంగారెడ్డిలో మహేందర్‌రెడ్డి, నల్గొండలో జగదీశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో జూపల్లి కృష్ణారావు, కరీంనగర్‌లో ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించారు.

 ఎంసీహెచ్‌ఆర్‌డీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్...
 రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లు, అమర వీరుల కుటుంబాలకు ఉద్యోగాలు, భూ వివాదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించేందుకు ఈనెల 23న ఎంసీహెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం కానున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపైనా ఈ సందర్భంగా చర్చించే అవకాశముంది.

Advertisement
Advertisement